ప్రతి కార్యకర్తకూ అండగా నిలుస్తాం
పెనుకొండ రూరల్: పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ అండగా నిలుస్తామని, జగనన్న 2.0లో కార్యకర్తలందరికీ న్యాయం జరుగుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ సమన్వయకర్త ఉషశ్రీ చరణ్ స్పష్టం చేశారు. శనివారం స్థానిక శ్రీ కృష్ణదేవరాయల వై జంక్షన్ సమీపంలో నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ కార్యకర్తల విసృత స్థాయి సమావేశం నిర్వహించారు. హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రమేష్ రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల పరిశీలకురాలు మధుమతి సమక్షంలో గ్రామ/ వార్డు కమిటీల ఏర్పాటుపై మండలాల వారీగా చర్చించారు. పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, గ్రామ/ వార్డు సభ్యులకు, కార్యకర్తలకు పార్టీ అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఉషశ్రీచరణ్ మాట్లాడుతూ, గ్రామ/వార్డు స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని, భవిష్యత్తులో ప్రజా నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్రా భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ... గ్రామ/వార్డు స్థాయిలో ఏర్పాటు చేసే కమిటీల్లో కోవర్టులకు అవకాశం లేకుండా కమిటీ సభ్యులు, నాయకులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రతి సభ్యుడు పార్టీ అభ్యున్నతికై అంకిత భావంతో పనిచేయాలన్నారు. పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర మాట్లాడుతూ...పోరాటమే ఆయుధంగా ప్రతి కమిటీ సభ్యుడు పని చేయాలన్నారు. పార్టీ పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని మరచి వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై తప్పడు కేసులు బనాయించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. అయినా కార్యకర్తలెవరూ భయపడవద్దని, అందరికీ పార్టీ అండగా ఉంటుందన్నారు. నియోజకవర్గం పరిశీలకురాలు మధుమతి రెడ్డి మాట్లాడుతూ... కమిటీ సభ్యులు పదవులు వచ్చాయని అలసత్వం వహించవద్దన్నారు. మన పోరాటం రాక్షస ప్రభుత్వంతో అన్న విషయాన్ని గుర్తించుకుని ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్ రెడ్డి, పార్టీ వాల్మీకి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పొగాకు రామచంద్ర, హిందూపురం పార్లమెంట్ ఎన్నికల పరిశీలకుడు రమేష్ రెడ్డి, పెనుకొండ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకురాలు మధుమతి రెడ్డి, నియోజకవర్గంలోని ఐదు మండలాల కన్వీనర్లు బోయ నరసింహ, సుధాకర్ రెడ్డి, నరసింహ మూర్తి, తిమ్మయ్య, వెంకటేష్, శంకర్, గజేంద్ర, జెడ్పీటీసీ సభ్యులు జయరాం నాయక్, అశోక్, సీనియర్ నాయకులు గంపల రమణారెడ్డి, శివారెడ్డి, నాగళూరు ప్రభాకర్‌రెడ్డి, రఘురామరెడ్డి, ఎన్.నారాయణరెడ్డి, సి.నారాయణరెడ్డి, మండల మాజీ కన్వీనర్లు నాగళూరు బాబు, తుంగోడు నారాయణరెడ్డి, నాయకులు ప్రకాశ్‌రెడ్డి, బోయ మైనర్ రాము, ఆంజనేయుల నాయక్, విశ్వనాథ్ నాయక్, నారాయణ యాదవ్, గోపాల్ రెడ్డి, నాగిరెడ్డి, కొండల రాయుడు, చెన్నకేశువులు, పీజే నాగరాజు, తయ్యూబ్, సద్దాం, శేషాద్రి, బాబు, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
జగనన్న 2.0లో
తప్పక న్యాయం జరుగుతుంది
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్
మంత్రి అక్రమాలపై రాజీలేని పోరాటం
బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత నియోజకవర్గ వ్యాప్తంగా సహజవనరులైన ఇసుక, ఎర్రమట్టి కొల్లగొడుతున్నారని ఉషశ్రీచరణ్ మండిపడ్డారు. ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తూ..రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇక నుంచి మంత్రి అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తామన్నారు. సహజవనరులు కొల్లగొడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ప్రతి కార్యకర్తకూ అండగా నిలుస్తాం


