పోలీసు బందోబస్తు నడుమ భవనాల కూల్చివేత
న్యూస్‌రీల్
హిందూపురం: పట్టణంలోని ప్రధాన రహదారిలో శనివారం మున్సిపల్ అధికారులు పోలీసు బందోబస్తు నడమ భవనాల కూల్చివేత పనులు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భారీగా పోలీసులను మోహరించారు. రైల్వే రోడ్డు విస్తరణ పనులకు ఆటంకంగా ఉన్న షాపులు, భవనాలను నేలమట్టం చేశారు. కొందరు భవన యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నామని చెబుతున్నా అధికారులు పట్టించుకోలేదు. కోర్టు నుంచి తమకు సమాచారం అందలేదని స్పష్టం చేశారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న భవన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిస్తామన్నారు. పట్టణాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున కోరారు.
డీఏ చెల్లింపులో
సమస్యలు పరిష్కరించాలి
చిలమత్తూరు: టీచర్లకు డీఏ బకాయిల చెల్లింపులో సమస్యలు పరిష్కరించాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బడా హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి సుందరరాజు కోరారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాంకేతిక కారణాలతో డీఏ బకాయిల చెల్లింపు ఆలస్యమవుతోందన్నారు. సీపీఎస్ ఉద్యోగులకు ఒక విడత మాత్రమే బకాయిలు అందాయన్నారు. విద్యాశాఖ, ఇతర శాఖల డీడీఓలు బిల్లులు పంపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. సాంకేతిక కారణాలు సాకుగా చూపకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.


