పోలీసుల వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
గోరంట్ల (సోమందేపల్లి): పోలీసుల వేధింపులు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గోరంట్లలో తీవ్ర దుమారం రేపింది. బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ గోరంట్ల పోలీసుస్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగుతూ తీసుకున్న సెల్ఫీ వీడియో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే... గోరంట్ల మండలం వానవోలుకు చెందిన మహేష్ (37) గతంలో స్థానికంగా ఓ ప్రైవేటు డెయిరీలో పనిచేసేవాడు. కంపెనీ నుంచి బయటికి వచ్చాక మహేష్‌కు రావాల్సిన పీఎఫ్ మొత్తాన్ని కంపెనీ నిర్వాహకులు ఇవ్వలేదు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం డెయిరీ వద్దకు వెళ్లిన మహేష్.. అక్కడి పాల క్యాన్లు తీసుకురాగా, డెయిరీ నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తనను పోలీసులు తరచూ స్టేషన్‌కు పిలిపించి వేధింపులకు గురి చేస్తున్నారంటూ శుక్రవారం మహేష్ గోరంట్ల పోలీస్ స్టేషన్ వద్ద పురుగుల మందు తాగాడు. స్థానికులు వెంటనే హిందూపురం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ బాధితుడు తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా, మానసిక ఒత్తిడి, వ్యక్తిగత కారణాలతోనే మహేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు పెనుకొండ డీఎస్పీ నర్సింగప్ప వివరణ ఇచ్చారు.


