అనంతపురం: ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంత క్రీడాగ్రామంలోని ఆర్డీటీ ఫుట్‌బాట్ స్టేడియం వేదికగా సాగుతున్న ఏపీ సూపర్‌కప్ ఫుట్‌బాల్ టోర్నీ రెండో రోజు హోరాహోరీగా సాగింది. తొలి మ్యాచ్‌లో తుంగభద్ర క్లబ్ జట్టుతో తలపడిన కోరమాండల్ క్లబ్ జట్టు 3–1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. నల్లమల క్లబ్, పెన్నా క్లబ్ మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఇరు జట్లూ చెరో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రా అయింది. గోదావరి క్లబ్, వంశధార క్లబ్ మధ్య జరిగిన మూడో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. మ్యాచ్ ఆరంభం నుంచి గోదావరి క్లబ్ జట్టు క్రీడాకారులు దూకుడును ప్రదర్శిస్తూ వచ్చారు. 7–0 గోల్స్ తేడాతో గోదావరి క్లబ్ జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. కొల్లేరు క్లబ్, విశాఖ క్లబ్ జట్ల మధ్య జరిగిన నాల్గో మ్యాచ్‌లో కొల్లేరు రెండు గోల్స్ సాధించింది. విశాఖ క్లబ్ జట్టు పేలవమైన ఆటతీరుతో ఒక్క గోల్ కూడా సాధించలేక చతికిలపడింది. ఈ మ్యాచ్‌లో కొల్లేరు క్లబ్ జట్టు విజయం సాధించింది. ఇప్పటి వరకూ జరిగిన మ్యాచ్‌ల్లో కొల్లేరు, కోరమాండల్ క్లబ్ జట్లు ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాయి. మ్యాచ్‌లను ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఏపీఎఫ్‌ఏ సీనియర్ క్రీడాకారులు సుధాకర్, సిరాజుద్దీన్, నీలాద్రి, శేషగిరి రావు, అనిల్, సురేష్, పవన్, రాజేష్ పరిశీలించారు. మ్యాచ్ కమిషనర్‌గా రెడ్డప్ప వ్యవహరించారు.