ప్రశాంతి నిలయం: జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా పరిశ్రమలశాఖ పనితీరుపై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పథకంలోని తీసుకురావాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన ఇండస్ట్రీయల్ పాలసీకి అనుగుణంగా జిల్లా ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందివ్వనున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు సహకారం అందించాలన్నారు. జిల్లా స్థాయి, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. ప్రధాన మంత్రి విశ్వకర్మ, పీఎంఈజీపీ పథకానికి అర్హులైన లబ్ధిదారుల ఎంపిక, మండలాల వారీగా జాబితా సిద్ధం చేయాలని సూచించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ నాగరాజు, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ సోనీ సహాని, డీపీఓ సుమంత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్