కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ రోజైన ఆదివారం శ్రీవారు పగలు సూర్య ప్రభ, రాత్రి చంద్ర ప్రభ వాహనాలపై విహరించారు. లోకంలో పుట్టడం, పెరగడం, నశించడం అనే మూడు ప్రక్రియలు కాలాధీనాలు. ఆ కాల స్వరూపుడిని తానే అంటూ చాటి చెబుతూ శ్రీవారు సూర్య, చంద్ర ప్రభలనధిష్టించి దర్శనమిచ్చారు. సూర్య మండల మధ్యస్తుడైన శ్రీ మహా విష్ణువుకు నారాయణుడని పేరు. పగటికి సూర్యుడు రారాజైతే, రేయికి చంద్రుడు అధిపతి. సృష్టికి ఎంతో ముఖ్యమైన ఈ రేయింబవళ్లను శ్రీమహావిష్ణువు రెండు కళ్లుగా కలిగి ఉండి వాటినే వాహనాలుగా మార్చుకొని సృష్టిలో సర్వమూ తానే అని చాటిచెబుతూ తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవ ఉభయదారులుగా అంబే శ్రీరామమూర్తి కుటుంబ సభ్యులు వ్యవహరించారని ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో సోమవారం మోహినీ ఉత్సవం నిర్వహించనున్నారు.
నృసింహుని సన్నిధిలో కలెక్టర్
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ చేతన్ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం కలెక్టర్‌కు ఈఓ శ్రీనివాసరెడ్డి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
రథోత్సవానికి ఏర్పాట్లు
ఈ నెల 20న నిర్వహించనున్న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవానికి ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రథానికి కప్పిన రేకులు తొలగించి అగ్నిమాపక శాఖ అధికారుల సాయంతో నీటితో శుభ్రం చేశారు. రథం లాగేందుకు మోకులు, తెడ్లు సిద్ధం చేస్తున్నారు.
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం
సూర్య, చంద్రప్రభ వాహనాలపై నృసింహుడి విహారం