సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘ఇది నా దారి. ఈ దారి గుండా ఎవరు వెళ్లినా వారి అంతు చూస్తా’ అంటూ కొంత కాలంగా గ్రామస్తులను ఓ కూటమి నేత బెంబేలెత్తిస్తున్నాడు. రహదారికి ఏకంగా మొద్దులు అడ్డుగా వేసి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. వివరాలు... ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామంలో శింగంశెట్టి వంశస్తులకు చెందిన 50 కుటుంబాల వారు ఓ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాలనీకి సమీపంలో ఓ ఆలయాన్ని నిర్మించాలని అప్పట్లో గ్రామ పెద్దలు తీర్మానించారు. అయితే స్థల వివాదం తలెత్తడంతో ఆలయ నిర్మాణాన్ని కొందరు వ్యతిరేకించారు. ఈ సమస్య ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. మరికొన్ని రోజుల్లో తీర్పు వెలువడే అవకాశం ఉండడంతో గ్రామానికి చెందిన కూటమి నాయకులు వర్గ కక్షలకు ఆజ్యం పోశారు. ఏళ్ల తరబడి ఆ కాలనీ నుంచి ప్రధాన రహదారికి ఉన్న రస్తా వెంట కాలనీ వాసులు తిరుగుతుండేవారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత గ్రామానికి చెందిన కూటమి నేత ఆధిపత్యం కోసం రస్తా విషయాన్ని తెరపైకి తెచ్చాడు. ఈ రస్తా స్థలం తనకు సంబంధించిందని, తన పట్టా భూమిలో ఉందని, ఆ రస్తా వెంట ఎవరూ వెళ్లకూడదంటూ వారం రోజులుగా గ్రామస్తులకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. ఉన్నఫలంగా బుధవారం రస్తాకు మొద్దులు అడ్డుగా పెట్టి అక్కడే కుర్చీలు వేసుకుని తన వర్గీయులతో కలసి కూర్చొన్నాడు. తన మాట బేఖాతరు చేసి రస్తాలో అడుగుపెడితే అంతు చూస్తానంటూ రెచ్చిపోయాడు. దీంతో కాలనీ వాసులు విషయాన్ని రెవెన్యూ, పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సాయంత్రం అధికారులు వచ్చి రస్తాకు అడ్డుగా వేసిన మొద్దులను తొలగించారు.
గ్రామస్తులను బెదిరించిన కూటమి నేత
రహదారికి మొద్దులు అడ్డుగా వేసిన వైనం