
డీఆర్ కాలనీలో చోరీ
హిందూపురం అర్బన్: స్థానిక డీఆర్ కాలనీలో నివాసముంటున్న హిందూపురం మండలం కొటిపి పంచాయతీ కార్యదర్శి సుహాసిని ఇంట్లో చోరీ జరిగింది. గురువారం ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనిపై ఆమె బెంగళూరుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు శుక్రవారం వేకువజామున ఇంటి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 16 తులాల బంగారు నగలు, రూ.40 వేల నగదు అపహరించుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న సుహాసిని చోరీ విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై సీఐ రియాజుద్దీన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
శతాధిక వృద్ధురాలి మృతి
చెన్నేకొత్తపల్లి: మండలంలోని మేడాపురం పంచాయతీ పెద్ద మొగలాయపల్లికి చెందిన ఓబులమ్మ(110) శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందే వరకూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొత్తం నాలుగు తరాల వారసులను చూసి ఎంతో సంతోషించేది.
మత్స్య శాఖ ఉద్యోగి ఆత్మహత్య
గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల డ్యాంలో ఉన్న మత్స్యశాఖ కేంద్రంలో ఫిషర్ మ్యాన్‌గా పనిచేస్తున్న అల్లాబకాష్ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు పెనకచెర్ల డ్యాం నివాసి అయిన అల్లాబకాష్ మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
వృద్ధుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం టౌన్: పట్టణంలోని భంభం స్వామి లే అవుట్‌లో నివాసముంటున్న వద్ది జయరాములు(65) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పట్టణ శివారు బళ్లారి రోడ్డులో ఉన్న నగర వనంలో శుక్రవారం ఉదయం జయరాములు మృతదేహాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. మృతి చెంది నాలుగు రోజులైనట్లుగా తెలుస్తోంది. జయరాములుకు ఇద్దరు కుమారులున్నారు. గత ఆదివారం సాయంత్రం నుంచి తమ తండ్రి కనిపించడం లేదని అప్పట్లో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నగర వనంలో జయరాములు మృతదేహం లభ్యం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన జయరాములు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోషంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.
ఐరన్ మార్ట్‌లో చోరీ
గుత్తి: స్థానిక అనంతపురం రోడ్డులోని సబిహా స్టీల్ అండ్ ఐరన్ మార్ట్‌లో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ దొంగ మార్ట్ షట్టర్‌ను ఐరన్ ర్యాడ్‌తో తెరచి లోపలకు ప్రవేశిస్తున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. రెండు క్యాష్ బాక్స్‌ల్లోని సుమారు రూ. 33 వేలు నగదుతో పాటు ఓ సెల్‌ఫోన్‌ను దుండగులు అపహరించుకెళ్లాడు. ఘటనపై ఐరన్ మార్ట్ యజమాని కేఎస్ ఖాజా ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్ షాప్‌ను పరిశీలించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
ఇసుక దిబ్బల పరిశీలన
కణేకల్లు: మండలంలోని వేదవతి హగరి నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలను జెసెల్ షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనర్బీట్ (జీఐజెడ్) బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. కళేకుర్తి, మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు, మీనహళ్లి, బిదరకుంతం గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో పర్వతాలను తలపించేలా ఏర్పడిన ఇసుక దిబ్బలను చూడగానే జీఐజెడ్ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ గోపీనాథ్, అసిస్టెంట్ టెక్నికల్ నిపుణుడు సంతోష్, ప్లానింగ్ నిపుణుడు ప్రసాద్ ఆశ్చర్యపోయారు. వారి వెంట రాయదుర్గం ఏపీడీ అసిస్టెంట్ దేవరాజు, ఏపీఓ సుధాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై రోజురోజుకూ విస్తరిస్తున్న ఇసుక మేటల వల్ల కలిగే పంట నష్టాలపై, పంటల సాగుకు తలెత్తుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఆషాఢంలో వేగంగా వీచే గాలి వల్ల ఇసుక తెరలు తెరలుగా లేచి పక్క భూముల్లో పడుతుందని రైతులు తెలిపారు. వేరుశనగ విత్తు మొదలు మొలకెత్తే వరకూ తామెంతో ఆందోళనతో గడపాల్సి వస్తోందన్నారు. ఇదే ఇసుక నల్లరేగడి భూములు, చౌడు భూములకు తరలించి ఆ భూమిపై పరిచి పంటలు సాగు చేస్తే మేలైన దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. అవసరమైన రైతులకు ఈ ఇసుకను తరలించే ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపుతోపాటు పలుచోట్ల రేగు, సరుగుడు, గోరింటాకు తదితర చెట్లను పెంచడం వల్ల కూడా ఎడారి నివారణకు సత్ఫలితాలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎడారి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు జీఐజెడ్ బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో బొమ్మనహళ్ ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సోమన్నగౌడ్, హరి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.

డీఆర్ కాలనీలో చోరీ

డీఆర్ కాలనీలో చోరీ