కూటమిలో భాగస్వామిగా పోలీస్‌ వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

కూటమిలో భాగస్వామిగా పోలీస్‌ వ్యవస్థ

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

● ఈ నలుగురూ అరాచకాలను

సృష్టిస్తున్నారు

● ధ్వజమెత్తిన మాజీ మంత్రి కాకాణి

కొడవలూరు (కోవూరు): కూటమిలో నాలుగో భాగస్వామిగా పోలీస్‌ వ్యవస్థ చేరి అరాచకాలు, అక్రమాలతో రక్త చరిత్ర సృష్టిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నార్తురాజుపాళెంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నార్తురాజుపాళెంలో శుక్రవారం చోటుచేసుకున్న ఉదంతాలే దీనికి అద్దం పడుతున్నాయని చెప్పారు. ఏడో వార్డులో తమ పార్టీ బలపర్చిన సంపూర్ణమ్మను తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలంటూ ఖాకీలు బెదిరించారని ఆరోపించారు. పదో వార్డులో తాము బలపర్చిన వీరి రమణమ్మ ఏకగ్రీవమయ్యారని, ఇదే అంశాన్ని ఆర్వో ప్రకటించాక.. అధికార పార్టీ ఒత్తిళ్లతో దీన్ని వెనక్కి తీసుకున్నారని.. ఇంతటి దారుణం ఎక్కడైనా ఉందానని ప్రశ్నించారు. ఇలా అయితే ఎన్నికలను ఎందుకు నిర్వహిస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు.

ప్రతి ఎలక్షన్లో మోసాలే..

పురపోరు మొదలుకొని పరిషత్‌, పల్లెపోరులోనూ మోసాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వార్డు సభ్యుల విషయంలోనే ఇంతటి దారుణాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఓట్లతో సంబంధం లేకుండా ఫలితాలను తారుమారు చేయడం.. అభ్యర్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉండి స్థానిక సంస్థల్లో తమ పార్టీ మద్దతు అభ్యర్థులు విజయం సాధిస్తుండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. దాడులు చేయడం, ఇళ్లు కూల్చడం లాంటివి చేస్తూ రక్తచరిత్ర సృష్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తిరగబడితే ఏమవుతుందో అధికారులు, పోలీసులు అర్థం చేసుకోవాలని హితవు పలికారు. తమ ప్రభుత్వమొచ్చాక ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, అప్పుడు మీ కుటుంబాల పరిస్థితేమిటో ఆలోచించుకోవాలని సూచించారు. చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ భావిస్తే, నామినేషన్‌ కేంద్రంలోని సీసీ కెమెరాలను పరిశీలించాలని పేర్కొన్నారు.

ఆర్వోపై కేసేస్తాం..

నార్తురాజుపాళెం ఆర్వోపై కోర్టులో కేసును దాఖలు చేయనున్నామని స్పష్టం చేశారు. అభ్యర్థులు ఎంతో కష్టపడి గెలుస్తారని.. ఇలాంటి వారి విషయంలో మోసాలు, దౌర్జన్యాలు చేయడం దారుణమని చెప్పారు. రాజకీయాల్లో చెడు సంప్రదాయాన్ని కూటమి పార్టీలు తీసుకొచ్చాయని మండిపడ్డారు. ఇన్ని గెలిచామనే సంఖ్యను పార్టీ అధిష్టానానికి చూపి, మంత్రి పదవులు పొందేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. కూటమి అరాచకాలపై పోరాడాలని నిర్ణయించుకున్నాకే ప్రెస్‌మీట్‌ను పెట్టామని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే రోడ్లపైకొస్తామని.. శాంతిభద్రతలకు విఘాతం కలిగితే కలెక్టర్‌, ఎస్పీలే బాధ్యత వహించాలని చెప్పారు. దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలుగా వ్యవహరిస్తూ, సాక్ష్యాధారాలను మాయం చేస్తున్నారని విమర్మించారు. కూటమి దిగజారుడు రాజకీయాలతో వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ఎన్నికలను న్యాయబద్ధంగా జరిపించాలని డిమాండ్‌ చేశారు.

రోజులన్నీ ఒకేలా ఉండవు..

రోజులన్నీ ఒకేలా ఉండవనే అంశాన్ని పోలీస్‌ అధికారులు గుర్తుంచుకోవాలని మాజీ మంత్రి, పార్టీ పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి హితవు పలికారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచకాలకు ఖాకీలు పాల్పడుతున్నారని విమర్శించారు. కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి.. పసుపు చొక్కాను ధరించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నుంచి ముడుపులు భారీగా అందడంతో ఓవరాక్షన్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. నడవడికను మార్చుకోవాలని, లేని పక్షంలో తమ ప్రభుత్వం కొలువుదీరాక ఇలాంటి వారిని రోడ్లపై నిలబెడతామని హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరి చలపతిరావు, కోవూరు నియోజకవర్గ పరిశీలకుడు కొండూరు అనిల్‌బాబు, సర్పంచ్‌ అభ్యర్థి వీరి కళైవాణి, ఎంపీటీసీ సభ్యుడు చేవూరు వేణు, పార్టీ మండలాధ్యక్షుడు మారంరెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement