● ఆర్వోపై దూషణల పర్వం
● వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి
కావలి: స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికార పార్టీ నేత శనివారం రెచ్చిపోయారు. ఎన్నికల అధికారిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసన్నాంజనేయులుపై దాడికి పాల్పడ్డారు. గాయపడిన ఆయన కావలి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కౌంటింగ్ ఏజెంట్ల గుర్తింపు కార్డు నిమిత్తం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా, టీడీపీ నేత శానం హరి తనపై దాడి చేశారని ఆరోపించారు. గమనించిన కమిషనర్ అబ్దుల్ రషీద్ వచ్చి అందర్నీ బయటకు పంపేశారని చెప్పారు. ఎన్నికల వేళ దౌర్జన్యాలు, దాడులకు పాల్పడి.. ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీడీపీ నేతలు యత్నించడం దారుణమన్నారు.
ఘర్షణపై ఏఎస్పీ విచారణ
దగదర్తి: దగదర్తిలోని పోలింగ్ కేంద్రం వద్ద కౌంటింగ్ ముగిసిన అనంతరం మాలేపాటి అనుచరులు.. వడ్డే శ్రీకాంత్‌నాయుడుడి అనుచరులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ, దాడుల ఘటనపై విచారణను ఏఎస్పీ సౌజన్య శనివారం చేపట్టారు. ఘర్షణకు దారితీసిన పరిస్థితులు తదితరాలపై పోలీసులు తెలియజేశారు. సీఐ శివశంకర్, ఎస్సై మహేంద్ర పాల్గొన్నారు.
పోటీ నుంచి తప్పుకోవాలంటూ
బెదిరింపులు
● ఖాకీల తీరుతో అపస్మారక స్థితిలోకి..
● గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలింపు
చిల్లకూరు: సైదాపురం మండలంలో పోలీసుల బెదిరింపులతో ఓ వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకోవడంతో చికిత్స నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి శనివారం తరలించారు. బాధితుడి కుటుంబసభ్యుల వివరాల మేరకు.. మర్లపూడికి చెందిన పాళెపు రత్నయ్య.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గ్రామంలోని మూడో వార్డులో పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అధికార పార్టీ నేతలు ఒత్తిడి తేగా, ఆయన నిరాకరించారు. దీంతో తనపై లైంగిక దాడి చేయబోయాడంటూ ఓ గిరిజన మహిళతో పోలీసులకు మూడు రోజుల క్రితం ఫిర్యాదు చేయించారు. విచారణ నిమిత్తం స్టేషన్‌కు తీసుకొచ్చి తీవ్రమైన ఒత్తిడి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నారని కుటుంబసభ్యులు ఆరోపించారు. సైదాపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
2న సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
నెల్లూరు (టౌన్): జిల్లా స్థాయి సాఫ్ట్‌బాల్ మెన్స్, ఉమెన్స్ జట్లను నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో డిసెంబర్ రెండున ఎంపిక చేయనున్నామని సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మలిరెడ్డి కోటారెడ్డి, సెక్రటరీ కామేశ్వరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్‌కార్డుతో ఉదయం పది గంటల్లోపు హాజరుకావాలని కోరారు. వివరాలకు 97036 54315, 80742 99640 నంబర్లను సంప్రదించాలని సూచించారు.


