టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి భూముల కబ్జా పర్వం యథేచ్ఛగా సాగుతోంది. అక్రమార్కుల కన్ను తాజాగా తిప్పపై పడింది. అనుకున్నదే తడవుగా, జేసీబీలతో చదును చేస్తూ తమ పనిని కానిచ్చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు బిజీగా ఉండటంతో, ఇక తమకు అడ్డుండదనే భావనతో చెలరేగిపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనకు వెళ్లే మార్గంలోని కలువాయి మండల పరిధిలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న 200 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. దాచూరు ముక్కుతిప్పలోని ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు పంచుకుంటున్నారు. ఆదూరుపల్లి – పెంచలకోన మార్గంలోని ఈ భూమిలో జేసీబీలను దింపి చదును చేసుకుంటున్నారు. జంగిల్ క్లియరెన్స్ చేసి నిమ్మ తదితర పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు.
అవకాశాన్ని.. అనుకూలంగా మార్చుకొని..!
ఎన్నికల విధుల్లో అధికార యంత్రాంగం తలమునకలైంది. ఇదే అదనుగా అక్రమార్కులు చెలరేగిపోయి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ ప్రాంతంలో ట్రాక్టర్ల పరుగులు.. జేసీబీల రణగొణ ధ్వనులు ఎక్కువవుతున్నాయి. పెంచలకోన వెళ్లే భక్తులు ఇక్కడ జరుగుతున్న తంతును చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఏదో పెద్ద పరిశ్రమలను పెడుతున్నామనే రీతిలో ఇక్కడ వ్యవహారం జరుగుతోంది.
ఇంత జరుగుతున్నా.. తెలీదా..?
దాచూరు ముక్కుతిప్ప ప్రాంతంలో ఇంత తతంగం జరుగుతున్నా, రెవెన్యూ అధికారులకు సమాచారం లేదాననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన వీరి నుంచి కనీస స్పందన లేకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. వీఆర్వోలు, వీఆర్‌ఏలు ఏమి చేస్తున్నారనే అంశంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 200 ఎకరాల్లో నిమ్మ, మామిడి తదితర పంటల సాగును ప్రారంభించి, ఫెన్సింగ్ వేయకముందే అధికార యంత్రాంగం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా ఈ అంశమై జేసీ మొగిలి వెంకటేశ్వర్లును ప్రశ్నించగా, దీనిపై తక్షణమే స్పందించాల్సిందిగా ఆత్మకూరు ఆర్డీఓ, కలువాయి తహసీల్దార్‌ను ఆదేశించామని బదులిచ్చారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే సహించేదిలేదని స్పష్టం చేశారు.
ప్రభుత్వ భూమి.. దర్జాగా కబ్జా
200 ఎకరాల్లో ఆక్రమణ
ఎన్నికల ప్రక్రియను అనుకూలంగా మలుచుకొని..
జేసీబీలతో కొల్లగొడుతున్న వైనం


