● అడ్డుకున్న మత్స్యకారులు
● పల్లెపోరులో రెండు వర్గాలుగా
అధికార పార్టీ నేతలు
సాక్షి టాస్క్‌ఫోర్స్: పల్లెపోరులో ఎమ్మెల్యేకు తీర ప్రాంతంలో నిరసన సెగ తగిలింది. నియోజకవర్గంలోని పలు పంచాయతీల్లో అధికార పార్టీ తరఫున పలువురు పోటీ పడుతున్నారు. వాకాడు మండలంలోని దుగరాజపట్నం పంచాయతీలో కొండూరుపాళెం, అంజలాపురం, శ్రీనివాసపురం గ్రామాలున్నాయి. దీంతో పల్లెపోరులో మత్స్యకారుల్లో ఒకర్ని ఎంపిక చేసుకోగా, దుగరాజపట్నంలో యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ మద్దతుతో బరిలో నిలిచారు. విషయాన్ని ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పెద్దగా పట్టించుకోకుండా వదిలేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి పాకానపడింది. ఎన్నికలు ఆదివారం జరగనున్న తరుణంలో ఓ వర్గాన్ని బుజ్జగించి.. మరో వర్గాన్ని పోటీలో ఉంచేలా గ్రామానికి భారీ కాన్వాయ్‌తో ఎమ్మెల్యే శనివారం వెళ్లారు. విషయం తెలుసుకున్న అంజలాపురం మత్స్యకారులు.. కారుకు నేరుగా అడ్డుపడి ఎందుకొచ్చారని ప్రశ్నించారు. ఇక్కడ మీరేమీ చేయాల్సిన అవసరం లేదని, వెళ్లిపోవాలని కోరారు. దీంతో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు యత్నించినా, మత్స్యకారులు అంగీకరించలేదు.
నిబంధనలు తుంగలో..
స్థానికంగా ఉన్న యువతను పక్కకు తీసుకెళ్లి వారికి నచ్చజెప్పి.. గ్రామంలో సమస్యలు తెలుసుకుంటున్నామనే నెపంతో పర్యటించానని చెప్తూ.. టీడీపీ మద్దతిచ్చిన అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం చేశారు. ప్రచారం ముగిసిన తరుణంలోనూ ఆయన ఇలా వ్యవహరించడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు.


