నెల్లూరు (టౌన్): జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించి నివేదిక పంపాలని డీఈఓ ఆర్.బాలాజీరావు డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలను ఆదేశించారు. శనివారం సాక్షిలో ‘మురిగిన గుడ్లు, అందని చిక్కీలు’ అనే శీర్షికన వెలువడిన కథనంపై స్పందించారు. సాక్షి కథనంలో పేర్కొన్న నాలుగు పాఠశాలలతో పాటు జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలు తీరును పరిశీలించాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారా.. లేదా.. పాఠశాలలకు సరఫరా చేసిన కోడిగుడ్ల నాణ్యతను పరిశీలించి గుడ్లు పరిమాణం, నాణ్యతా ప్రమాణాలు, విద్యార్థులు ఇంటి దగ్గర నుంచి క్యారేజీలు తీసుకొస్తున్నారా.. వంటి వాటిపై విచారణ చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, భోజన నిర్వాహకులు, సంబంధిత సిబ్బంది బాధ్యతను నిర్ధారించి వారి వివరాలు సేకరించాలన్నారు.
నేడూ విద్యుత్ బిల్లులు చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను ఆదివారం సెలవురోజు కూడా చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ సుధాకర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు నేడు యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
గంజాయి బ్యాచ్ హల్‌చల్
నెల్లూరు(వేదాయపాళెం): నగరంలోని 30వ డివిజన్ పరిధిలో నిత్యం రద్దీగా ఉండే వనంతోపు సెంటర్‌లో శనివారం గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేసింది. ఫూటుగా గంజాయి సేవించిన ఇద్దరు యువకులు స్థానిక ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు చేరి సిగరేట్‌లు తాగుతూ, నగదు డ్రా చేసుకునేందుకు అటుగా వచ్చిన ఖాతాదారులను అకారణంగా దుర్భాషలాడారు. స్థానిక దుకాణ నిర్వాహకుల వద్దకు వెళ్లి అడిగిన వస్తువులు లేవని చెప్పినందుకు బెదిరింపులకు దిగారు. వాహనాలు నిలిపిన వారితోనూ అకారణంగా గొడవకు దిగి భయభ్రాంతులకు గురిచేసినట్లు పలువురు వాపోయారు. ఇలాంటి ఘటనలు నక్కలగుంట, కొండాయపాళెంలలో కూడా తరచూ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.


