పంచాయతీ పోరుకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పంచాయతీ పోరుకు పటిష్ట బందోబస్తు

Nov 29 2026 3:11 PM | Updated on Nov 29 2026 3:11 PM

● ఎస్పీ అజిత వేజెండ్ల

నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పోలీస్‌శాఖ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కావలి డివిజన్‌లోని కొన్ని మండలాలు కలిపి మొత్తం 14 మండలాల్లోని 204 గ్రామ పంచాయతీల్లో ఆదివారం ఎన్నికలు జరుగుతాయి. ఈ క్రమంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు పోలీస్‌ యంత్రాంగం పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఎస్పీ అజిత వేజెండ్ల పర్యవేక్షణలో రెండు వేల మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. 74 అత్యంత సమస్యాత్మక, 101 సమస్యాత్మక, 326 సాధారణ పోలింగ్‌ లొకేషన్లను గుర్తించి ఆయా కేంద్రాల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. 14 డ్రోన్‌ బృందాలతో పోలింగ్‌ కేంద్రాలు, గ్రామాల్లో నిరంతర నిఘా కొనసాగించేలా చర్యలు చేపట్టారు. రూట్‌ మొబైల్స్‌, స్ట్రైకింగ్‌ ఫోర్సులను సిద్ధం చేసి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేస్తామని, ఓటర్లను నగదు, మద్యం, ఇతర ప్రలోభాలతో ప్రభావితం చేయడం, భయపెట్టడం, బెదిరించడం, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ అజిత వేజెండ్ల శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement