జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదం నెలకొంది.
లారీని ఢీకొని ఆటో బోల్తా
వెంకటాచలం: లారీని వెనుక నుంచి ఆటో ఢీకొని ఒకరు మృతిచెందగా, మరో 9 మందికి గాయపడిన ఘటన మండలంలోని సర్వేపల్లి పంచాయతీ నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామానికి చెందిన బత్తల పోలయ్య (58), మరో 9 మంది మత్స్యకారులు మనుబోలు సమీపంలోని గుంతల వద్దకు రొయ్యలు పట్టేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం తిరిగి ఊరికి బయలుదేరారు. నాగంబోట్లకండ్రిగ సమీపంలో కృష్ణపట్నం రోడ్డుపై లారీ అకస్మాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఆటో ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బత్తల పోలయ్యకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందగా, మిగిలిన వారు స్వల్పంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోలీసులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు.
ఇంటి సామగ్రి కొనుగోలుకు వెళ్తూ..
సంగం: ఇంటి సామగ్రి కొనుగోలు చేసేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మండలంలోని తరుణవాయి వద్ద జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నీలాయపాళెం గ్రామానికి చెందిన వెంకటరమణయ్య (57) బేల్దారి పనులు చేస్తుంటాడు. వివాహమై పిల్లలున్నారు. ఇంటికి సంబంధిచిన సామగ్రి కొనుగోలు చేసేందుకు బుచ్చిరెడ్డిపాళేనికి మోటార్‌బైక్‌పై వెళ్తుండగా అతడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం వాహనం ఆపకుండా వెళ్లిపోయినట్లు సమాచారం. తీవ్రగాయాలతో పడి ఉన్న వెంకటరమణయ్యను గుర్తించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆటో అదుపుతప్పి..
మనుబోలు: ఆటో బోల్తా పడటంతో వాకా రమేష్ (45) అనే వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వెంకటాచలం మండలం రామదాసుకండ్రిగ గ్రామానికి చెందిన రమేష్ ఓ ఛానల్లో మనుబోలు మండల విలేకరిగా పనిచేస్తున్నాడు. ఇల్లు కట్టిస్తున్నాడు. ఈ క్రమంలో సొంత ఆటోలో మనుబోలుకు వచ్చి సిమెంట్ బస్తాలు తదితరాలు తీసుకెళ్తున్నాడు. కొమ్మలపూడి క్రాస్‌రోడ్డు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడి రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు. హైవే మొబైల్ సిబ్బంది మస్తాన్, మహేష్ అతడికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం రమేష్‌ను హైవే అంబులెన్స్‌లో నెల్లూరులోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.


