నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 154 మంది హాజరై తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. వినతులను పరిశీలించిన ఎస్పీ.. చట్టపరిధిలో విచారించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్, మహిళా పోలీస్‌స్టేషన్, డీసీఆర్‌బీ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్లు టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి, బి.పాపారావు, దశరథరామారావు, వెంకటరావు, సిబ్బంది పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● కెమికల్స్, మెటీరియల్స్ సరఫరా చేస్తానని హైదరాబాద్‌కు చెందిన ప్రశాంత్‌రెడ్డి తమ వద్ద రూ.51.85 లక్షలు తీసుకుని మోసం చేశాడని చిల్లకూరు ప్రాంతంలోని ఎంఓ మినరల్స్ కంపెనీ ప్రతినిధి ఫిర్యాదు చేశాడు.
● సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని హైదరాబాద్‌కు చెందిన యదువీర్ రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశాడని కోవూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు.
● కార్తీక్‌తేజ్ అనే వ్యక్తి వెంటబడి వేధిస్తున్నాడని నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఫిర్యాదు చేశారు.
● భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు బంగారు ఆభరణాలు తీసుకుని ఇంటి నుంచి బయటకు పంపించారని ముత్తుకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం అందజేశారు.


