సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యం

Sep 1 2026 12:19 AM | Updated on Sep 1 2026 12:19 AM

సంగం: బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న ఓ యువతి అదృశ్యమైంది. సోమవారం ఆమె తండ్రి సుధాకర్‌రెడ్డి సంగం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారి కథనం మేరకు.. బద్వేల్‌లోని మడగలవారెపల్లికి చెందిన ఓ యువతిని సంగంలో ఓ యువకుడికి ఇచ్చి వివాహం చేసేందుకు నిశ్చయించారు. ఆదివారం రాత్రి జరిగిన పెళ్లి వేడుకలకు మడగలవారెపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌రెడ్డి కుమార్తె వచ్చింది. భోజన అనంతరం బంధుమిత్రులతో మాట్లాడింది. ఆ తర్వాత ఆమె అదృశ్యమైంది. సోమవారం కుమార్తె ఇంటికి రాకపోవడంతో సుధాకర్‌రెడ్డి సంగం వచ్చి బంధువుల వద్ద విచారించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

భార్యాభర్తలపై దాడి

మహిళ మెడలోని బంగారు సరుడు దోపిడీ

సంగం: వివాహ వేడుకలకు వెళ్లి తిరిగి సొంతూరికి వెళ్తున్న భార్యాభర్తలను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి వారిని కొట్టి మహిళ మెడలోని బంగారు సరుడును దోపిడీ చేసిన ఘటన ఆదివారం అర్ధరాత్రి జరిగింది. బాధితులు సోమవారం సంగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల మేరకు.. జెండాదిబ్బ పంచాయతీ మజారా అరవపాళెం గ్రామానికి చెందిన కరేటి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులు మోటార్‌బైక్‌పై ఆదివారం రాత్రి బుచ్చిరెడ్డిపాళెం మండలం చెల్లాయపాళెం వెళ్లారు. అక్కడ వివాహ వేడుకలకు హాజరయ్యారు. అర్ధరాత్రి పంచేడు రోడ్డు మీదుగా జెండాదిబ్బకు వెళ్తున్నారు. గ్రామ సమీపంలోని శ్మశానం వద్ద గుర్తుతెలియని ముగ్గురు యువకులు బైక్‌ను అడ్డగించి భార్యాభర్తలను కొట్టారు. భాగ్యలక్ష్మి మెడలో ఉన్న 2.5 సవర్ల తాళిబొట్టు సరుడును లాక్కెళ్లారు. లక్ష్మీనారాయణ 112కు ఫోన్‌ చేయడంతో సంగం పోలీసులు వచ్చే సరికి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.

దెబ్బతిన్న కండలేరు

హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు

రాపూరు: మండలంలోని కండలేరు ప్రాజెక్ట్‌కు సంబంధించి హెడ్‌రెగ్యులేటర్‌ గేట్లు, సాఫ్ట్‌లాక్‌ గేట్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. జలాశయాల భద్రత కమిటీ బృందం డ్యామ్‌ను సందర్శించింది. నీటినిల్వలు, గేట్ల పనితీరు, ఇతర అంశాలకు సంబంధించి స్థితిగతులను సభ్యులు తెలుసుకున్నారు. సోమవారం డ్యామ్‌ ఆర్గనైజేషన్‌ చైర్మన్‌ గోపాల్‌రెడ్డి, కమిటీ సభ్యులు వెంకటేశ్వర్లు, శ్రీకాంత్‌ మాట్లాడుతూ జలాశయం భద్రతకు సంబంధించిన అంశాలను రెండురోజులపాటు పరిశీలించామన్నారు. లీకేజీలు కూడా ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో చేపట్టాల్సిన రక్షణ చర్యల్ని గుర్తించామన్నారు. పూర్తి నివేదికను త్వరలో ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగుగంగ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యేశ్వరావు, కండలేరు ఈఈ గజేంద్రరెడ్డి, డీఈ అనిల్‌బాబు, ఏఈ అనిల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement