కావలి: అధికారంలో ఉన్నాం.. ఏం చేసినా చెల్లు బాటు అయిపోతుంది. మమ్మల్ని కేసులు ఏం చేయలేవు.. అనే ధోరణితో టీడీపీ నేతలు అరాచ కాలకు పాల్పడుతున్నారు. అధికారంలో ఉంటే మహిళలను వివస్త్రను చేస్తారా? చంపేస్తారా? రౌడీషీట్లు ఓపెన్ చేస్తారా? అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలుసుకోవాలని, తప్పు చేసిన ప్రతి ఒక్కరూ చట్టపరంగా జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. పట్టణంలోని కచ్చేరిమిట్టలో టీడీపీ నేతల చేతిలో వివస్త్రకు, దాడికి గురైన బాధితురాలిని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డితో కలిసి కాకాణి సోమవారం పరామర్శించారు. తన విషయంలో టీడీపీ నేతలు, పోలీసులు వ్యవహరించిన చర్యలను కన్నీరు ము న్నీరవుతూ బాధితురాలు వివరించారు. నీకు జరిగిన అవమానం, అన్యాయం తెలుసుకుని మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చలించిపోయారు. ధైర్యంగా ఉండమని, న్యాయం జరిగే వరకు న్యాయపోరాటం చేస్తామని వైఎస్ జగన్ మాటగా ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. అనంతరం కాకాణి మీడియాతో మాట్లాడుతూ కావలి పట్టణంలో ఎరుకుల మహిళపై జరిగిన ఘటన అమానవీయమన్నారు. సభ్య సమాజంలో ఇలాంటి దారుణాన్ని తామెన్నడూ చూడలేదన్నారు. కూటమి పాలనలో మహిళలు తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఎక్కడా లేదన్నారు. మహిళను కులం పేరుతో దూషిస్తూ, జుట్టు పట్టుకుని వీధిలోకి లాగి, బట్టలు ఊడదీసి వివస్త్రను చేశారన్నారు.
న్యాయం అడిగితే.. రౌడీషీట్లు పెడతారా?
తనపై జరిగిన దాడికి న్యాయం చేయమని గాయాలు, అవమానంతో బాధిత మహిళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకుని ‘నీ కొడుకుపై కేసు నమోదైంది. నిన్ను కొట్టిన విషయం బయటకు రాకుండా ఉంటే, మీ కొడుకుపై ఎలాంటి కేసు లేకుండా పంపించేస్తామ ని’ బెదిరించడం ఏమిటని పోలీసులను కాకాణి నిలదీశారు. ఒకవేళ కేసు పెడతామని భీష్మించుకుంటే, నీ కొడుకుపై గూండా యాక్ట్ పెడతామని, రౌడీషీట్ తెరుస్తామని, జైల్లో పెడతామని, కుటుంబానికి దక్కకుండా చేస్తామని టూటౌన్ పోలీసులు భయపెట్టి రాజీపత్రం రాయించి, ఇద్దరి మధ్య ఎలాంటి వివాదా లు లేవని, ఇకపై ఒకరి జోలికి ఒకరు పోమని బలవంతంగా సంతకం పెట్టించి కేసును క్లోజ్ చేశామని చెప్పారన్నారు.
తహసీల్దార్ ఏ విధంగా సర్టిఫికెట్ ఇస్తారు
బాధితురాలిని బలవంతంగా తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి వేలిముద్రలు వేయించుకుని కులం, మతం సర్టిఫికెట్లు జారీ చేశారంటూ కాకాణి ధ్వజమెత్తారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం జన్మతః ఏ కులం, మతానికి చెందుతారో, అదే కులం ఉంటుందనే విషయం తహసీల్దార్‌కు తెలియదా? అని ప్రశ్నించారు. తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన తహసీల్దార్ ఉద్యోగంలో ఉంటాడా? జైలుకు వెళ్లకుండా తప్పించుకుంటాడా? అని కాకాణి నిలదీశాడు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వ్యవహరించిన తీరుపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. ఈ రోజు గిరిజన కుటుంబం పడుతున్న బాధ కంటే వంద రెట్లు ఎక్కువ బాధను అధికారులు భవిష్యత్‌లో అనుభవించక తప్పదన్నారు.
నేరస్తుల కాపు కాస్తున్న ఎమ్మెల్యే
కావలిని కాపు కాస్తానని చెప్పిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి నేరస్తుల కాపు కాస్తున్నాడని కాకాణి ధ్వజమెత్తారు. కచ్చేరిమిట్టలో చుట్టు పక్కల ఉన్న మహిళలను విచారిస్తే, గిరిజన మహిళపై దాడి చేయడానికి ప్రధాన కారకుడు మాజీ కౌన్సిలర్ ఇబ్రహీం అని చెబుతున్నారని, ఇలాంటి వ్యక్తిని సమర్థించడమే దారుణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలన ఏ విధంగా సాగుతుందో ప్రజలు గమనిస్తున్నారని, మహిళలపై చేయి వేస్తే ఆ రోజే ఆఖరి రోజు అవుతుందన్న ఆయన మాటలు క్షేత్రస్థాయిలో నిజం కావడం లేదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాదిరిగా ఎన్నికల ముందు సుగాలి ప్రీతి హత్యను అడ్డం పెట్టుకుని హడావుడి చేసి అధికారంలోకి వచ్చాక మరిచిపోయే సంస్కృతి మాది కాదన్నారు. దాడికి గురైన బాధిత మహిళకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోతే జరిగేంత వరకు ఆమెకు మద్దతుగా ఉంటామన్నారు. ఒక వేళ చేయలేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధిత మహిళను అన్ని విధాల ఆదుకొని న్యాయం చేస్తామన్నారు.
గిరిజన మహిళకు అన్యాయం జరిగితే ఆమెనే పోలీసులు బెదిరిస్తారు
ఈ విషయం బయటకు రాకూడదని రాజీపత్రం రాయించారు
కేసును నీరుగార్చేందుకు కులం, మతం పేరుతో సర్టిఫికెట్లు సృష్టించారు
తహసీల్దార్ తప్పుడు సర్టిఫికెట్లు అందజేశారు
తప్పులు చేసిన పోలీస్, రెవెన్యూ అధికారులు జైలుకు వెళ్లక తప్పదు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి


