కష్టాలు.. కన్నీటి సుడులు | - | Sakshi
Sakshi News home page

కష్టాలు.. కన్నీటి సుడులు

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

కలెక్టరేట్‌లో

‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

వినతులు అందజేసిన ప్రజలు

నెల్లూరురూరల్‌: కాళ్లరిగేలా తిరుగుతున్నా సమస్యలకు పరిష్కారం మాత్రం దొరకడం లేదని పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌ తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి దూర ప్రాంతాల నుంచి అనేకమంది తరలివచ్చారు. డీఆర్వో విజయ్‌కుమార్‌, డిప్యూటీ కలెక్టర్లు కేశవర్ధన్‌రెడ్డి, వంశీకృష్ణ, సర్వే ల్యాండ్‌ రికార్డుల డీడీ నాగశేఖర్‌ తదితరులు వినతులు స్వీకరించారు.

మెరుగైన వసతులు కల్పించాలి

బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు హాస్టళ్లలో మెరుగైన వసతులు, భద్రత కల్పించాలని ఆలిండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యునైటెడ్‌ ఫోరం సామాజిక కార్యకర్తలు కోరారు. ఏలూరు జిల్లాలోని ఎస్సీ బాలికల హాస్టల్లో జరిగిన ఘటనను ఫోరం నాయకులు తీవ్రంగా ఖండించారు. దుప్పటి కావాలని అడిగిన బాలికను అర్ధరాత్రి సమయంలో హాస్టల్‌ నుంచి బయటకు పంపించిన ఘటన బాధాకరమన్నారు. కార్యక్రమంలో డి.పద్మజ, వి.రాజమ్మ, ఉషారాణి, ప్రభావతి, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మామిడి, పొగాకు రైతుల సమస్యలపై..

జిల్లాలో మామిడి, పొగాకు ధరలు భారీగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకోవాలని బీజేపీ నాయకుడు మిడతల రమేష్‌ డిమాండ్‌ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ సుమారు 25 వేల ఎకరాల్లో మామిడి, 45 వేల ఎకరాల్లో పొగాకు సాగు చేసిన రైతులు నష్టాల్లో ఉన్నారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పరిశ్రమల కొనుగోళ్లు తగ్గడంతో మామిడి ధరలు పడిపోయాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కిలో పొగాకును రూ.200కు తగ్గకుండా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ, ప్రస్తుతం సగటున రూ.160కే కొనుగోళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి, చిట్టిబాబు, ఆదినారాయణ, అల్లూరు నాగేంద్రసింగ్‌, ఏవీ సుబ్బయ్య, ముజీబ్‌, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

శ్మశాన భూమి ఆక్రమణ

ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలోని శ్మశాన భూమి ఆక్రమణలను తొలగించాలంటూ గ్రామస్తులు బీజేపీ ఆధ్వర్యంలో డీఆర్వో విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కొందరు పెత్తందారులు భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వాపోయారు.

పనిభారం తగ్గించాలంటూ..

అంగన్‌వాడీ కార్యకర్తలపై అదనపు పనిభారాన్ని తగ్గించాలని సీఐటీయూ నగర కార్యదర్శి జి.నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షురాలు రెహనా బేగం, కార్యదర్శి సుజాతమ్మ డిమాండ్‌ చేశారు. వారు మాట్లాడుతూ జనగణన విధులను అంగన్‌వాడీలపై అదనపు భారంగా మోపుతున్నారన్నారు. ఇప్పటికే ఇచ్చిన ట్రైనింగ్‌లు, డ్యూటీలను రద్దు చేయాలని కోరారు.

కుమ్మర మాన్యం ఆక్రమణ

మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని 3.32 ఎకరాల కుమ్మర మాన్యం భూమిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్‌ కుమ్మర యువసేన రాష్ట్ర అధ్యక్షులు పెళ్లూరు సుమన్‌ ప్రజాపతి డిమాండ్‌ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా కుమ్మర కులస్తుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి సంబంధించి అల్లంపాటి వేణుగోపాల్‌రెడ్డి, ఆయన తండ్రి చిన్నారెడ్డి రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లు నమోదు చేసుకుని పాస్‌ పుస్తకాలు పొందారని ఆరోపించారు. తహసీల్దార్‌ను సంప్రదించగా కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారని పేర్కొన్నారు. న్యాయం చేయాలని కోరుతూ జూలై 8న మర్రిపాడు రెవెన్యూ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో మోచర్ల మధు ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.ృ

సమస్యలు పరిష్కరించాలంటూ..

విద్యుత్‌ శాఖ ఉద్యోగులు, కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ అనుబంధ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్నారు. ఎనర్జీ అసిస్టెంట్లకు జేఎల్‌ఎం, జేఎల్‌ఎంలకు ఏఎల్‌ఎం పదోన్నతుల హామీలను అమలు చేయాలన్నారు. విద్యుత్‌ సబ్‌స్టేషన్ల ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేయాలని, ఉద్యోగులకు బీమా సౌకర్యాలు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో జాకీర్‌ హుస్సేన్‌, ప్రసాద్‌, జి.నాగయ్య, సుమన్‌, గిరిబాబు, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ రద్దుకు డిమాండ్‌

రైతులకు ఎరువుల సరఫరాలో ఇబ్బందులు కలిగిస్తున్న ఏపీ ఏఐఎంఎస్‌ యాప్‌ను వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాప్‌ అమలుతో రైతులకు అవసరమైన యూరియా సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌలు రైతుల వివరాలు యాప్‌లో సరిగా నమోదు కాకపోవడంతో వారు భూ యజమానులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం 15 రోజులకు ఒకసారి ఇస్తున్న ఎరువులను వారానికి ఒకసారి అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో తుళ్లూరు గోపాల్‌, మూలివెంగయ్య, జనార్ధన్‌, పుల్లయ్య, వెంకటరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement