బకాయిలు చెల్లించకపోవడం దారుణం | - | Sakshi
Sakshi News home page

బకాయిలు చెల్లించకపోవడం దారుణం

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

నెల్లూరు(టౌన్‌): కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా పెండింగ్‌ బకాయిలు చెల్లించకపోవడం దారుణమని ఏపీటీఎఫ్‌ నాయకులు అన్నారు. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ పిచ్చిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్‌ నిర్వహించి పాస్‌ మార్కులను 35గా నిర్ణయించాలన్నారు. పీఆర్సీ కమిటీని నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఫెడరేషన్‌ బాధ్యులు సులోచనమ్మ, శీనయ్య, విజయభారతి, కిశోర్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

115 మంది చిన్నారుల అప్పగింత

నెల్లూరు(క్రైమ్‌): భారీ పోలీస్‌ భద్రతా ఏర్పాట్ల మధ్య రొట్టెల పండగ జరుగుతోంది. సోమవారం ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీ సీహెచ్‌ సౌజన్య బందోబస్తును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలిచ్చారు. పోలీసు అధికారులు 450 మంది చిన్నారులకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగింగ్‌ చేశారు. తప్పిపోయిన 115 మంది చిన్నారులను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోగొట్టుకున్న ఎనిమిది సెల్‌ఫోన్లు, రూ.46 వేల నగదును బాధితులకు అందజేశారు. పిక్‌ పాకెటింగ్‌కు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా బాంబ్‌, డాగ్‌స్క్వాడ్‌లు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

నా కుమారుడిని స్వదేశానికి తీసుకురండి

ప్రభుత్వానికి తండ్రి వినతి

బుచ్చిరెడ్డిపాళెం: ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న తన కుమారుడు బరిగల ప్రేమ్‌చంద్‌ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని బుచ్చిరెడ్డిపాళెం పట్టణానికి చెందిన బరిగల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 2023లో తన కుమారుడిని ఎంబీబీఎస్‌ చదివించేందుకు సింహపురి ఎడ్యుకేషనల్‌ కన్సల్టెన్సీని ఆశ్రయించామన్నారు. అప్పులు చేసి రూ.16 లక్షలను దాని ప్రతినిధి సుధాకర్‌రెడ్డికి చెల్లించామని చెప్పారు. అయితే కాలేజీకి కేవలం రూ.40 వేలే చెల్లించడంతో తమ కుమారుడి వీసా పునరుద్ధరణ జరగలేదన్నారు. వీసా గడువు ముగియడంతో ప్రస్తుతం ప్రేమ్‌చంద్‌ ఫిలిప్పీన్స్‌లో అనధికారికంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎప్పుడు అరెస్ట్‌ చేస్తారో అనే భయంతో ఇబ్బందులు పడుతున్నాడని తెలిపారు. తాను బేల్దారి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నానని, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నానని వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కుమారుడికి ఏదైనా అపాయం జరిగితే తాము తట్టుకోలేమని, మోసం చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కండలేరులో 32.510 టీఎంసీలు

రాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 32.510 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 2,000, లోలెవల్‌ కాలువకు 30, పిన్నేరు కాలువకు 5, మొదటి బ్రాంచ్‌ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement