అగ్నిమాపక శాఖ ఏర్పాట్లపై ఆరా | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక శాఖ ఏర్పాట్లపై ఆరా

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

నెల్లూరు(క్రైమ్‌): రొట్టెల పండగ సందర్భంగా బారాషహీద్‌ దర్గా ఆవరణలో అగ్నిమాపక శాఖ చేపట్టిన ఏర్పాట్లను ఆ శాఖ డైరెక్టర్‌ డి.మురళీమోహన్‌ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో ఫైర్‌ ఇంజిన్లు వేగంగా ఘటనా స్థలానికి చేరుకునేలా మార్గాల్లో తోపుడు బండ్లు, ఇతర అడ్డంకుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు. ఆయన వెంట జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి వాకా శ్రీనివాసరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

మిద్దైపె వాకింగ్‌ చేస్తూ..

కిందపడి వృద్ధుడి మృతి

నెల్లూరు(క్రైమ్‌): ఇంటి మిద్దైపె వాకింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు కిందపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు సరస్వతి నగర్‌లో శ్రీనివాసులురెడ్డి (73) నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలంగా మెడనొప్పితో బాధపడుతున్నాడు. రాత్రివేళ నిద్రలో మెలకువ వచ్చినప్పుడు ఇంటి వరండాలో, మిద్దైపె వాకింగ్‌ చేయడం అలవాటు. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున నిద్రలేచిన శ్రీనివాసులురెడ్డి భార్యను లేపి కొబ్బరినీళ్లు తాగారు. నిద్రరావడం లేదని మిద్దైపెకి వెళ్లి వాకింగ్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు మొదటి అంతస్తు పైనుంచి కింద వరండాలో పడిపోయాడు. కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని శ్రీనివాసులురెడ్డిని 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. దర్గామిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

పంట కాలువలో

మృతదేహం

అల్లూరు: మండలంలోని అల్లూరు ప్రధాన రహదారి బోడిసత్రం గ్రామం సమీపంలో పంట కాలువలో సోమవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పరిశీలించారు. మృతుడిని అల్లూరు తూర్పువీధికి చెందిన చిక్కిరేణి వెంకట సుబ్బయ్య (40)గా గుర్తించారు. అతను బియ్యం స్టోర్‌లో కూలీ పని చేస్తున్నాడు. భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఏమైందో గానీ కాలువలో విగతజీవిగా కనిపించాడు. అనుమానాస్పదగా మృతిగా కేసు నమోదు చేశారు.

నిమ్మ ధరలు (కిలో)

పెద్దవి : రూ.50

సన్నవి : రూ.20

పండ్లు : రూ.10

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement