ఆగని భూ ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

ఆగని భూ ఆక్రమణలు

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూ ఆక్రమణలపై పత్రికల్లో కథనాలు రావడం.. రెవెన్యూ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయడం, ఆక్రమణదారులు యథావిధిగా వాటిని పక్కనపెట్టి మళ్లీ కబ్జాలకు పాల్పడటం షరా మామూలైంది. ఇది రెవెన్యూ అధికారుల పనితీరుకు అద్దం పడుతుతోందని జనం అంటున్నారు. తాజాగా మరోసారి పెగళ్లపాడు గ్రామంలోని సర్వే నంబర్‌ 6లో భూమిని చదును చేసి ఆక్రమణకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

వివాదాలు కొనసాగుతూనే..

34 ఎకరాల పరిధిలో ఉన్న భూమిలో గ్రామానికి చెందిన డీలర్‌ దుద్దుకుంట శేఖర్‌ సుమారు 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు యత్నించినట్లు గ్రామస్తులు చెబుతున్న మాట. ఇదే గ్రామంలో గతంలో కూడా సుమారు 12 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు పేర్కొంటున్నారు. గతంలోనూ ప్రభుత్వ భూములపై వివాదాలున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్న ప్రాంతాలను చదును చేయడం, కంచెల ఏర్పాటు, సాగు ప్రయత్నాలపై ఫిర్యాదులు వెళ్లినట్లు గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. అయితే శాశ్వత చర్యలు కనిపించలేదు.

చెలరేగిపోతూ..

మండలంలో హైలెవల్‌ కెనాల్‌ భూసేకరణ పనులు జరుగుతుండడంతో గతంలో రెవెన్యూ రికార్డుల్లో భూములను అందజేసిన వారు, అదే విధంగా ఆయా గ్రామాల్లోని నాయకులు మళ్లీ భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. రెవెన్యూ అధికారులకు అర్జీలు సమర్పించినా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారే కానీ పట్టించుకోకపోవడంతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. ఒకసారి కఠినంగా వ్యవహరిస్తే మళ్లీ ఆ భూమిలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు చేయరని, రెవెన్యూ అధికారులు మాత్రం హెచ్చరిక బోర్డులతో సరిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement