● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో
వృద్ధుడి ఫిర్యాదు
నెల్లూరు(క్రైమ్): ‘నాకు ఇద్దరు కుమారులున్నారు. ఆస్తిని వారికి సమానంగా పంచాను. అయినా బాగోగులు పట్టించుకోవడం లేదు. పెద్ద కుమారుడు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు’ అంటూ బిట్రగుంట పరిధికి చెందిన ఓ వృద్ధుడు ఫిర్యాదు చేశాడు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. 69 మంది తమ సమస్యలను వినతుల రూపంలో ఎస్పీ అజిత వేజెండ్లకు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, డీసీఆర్‌బీ, మహిళా పోలీస్‌స్టేషన్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌లు ఎన్.రామారావు, టీవీ సుబ్బారావు, బి.శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నా తల్లి ఇటీవల మృతిచెందారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. లోతుగా విచారించి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని విడవలూరుకు చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం ఇప్పిస్తానని గుంటూరుకు చెందిన సంపత్, రామాజంనేయులు, వారి స్నేహితులైన వంశీకృష్ణ, రత్నకుమారిలు రూ.3.96 లక్షలు తీసుకున్నారు. నకిలీ కాల్ లెటర్ ఇచ్చి మోసం చేశారు. విచారించి న్యాయం చేయాలని బిట్రగుంట ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోరారు.
● నా కుమార్తె అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. త్వరితగతిన ఆచూకీ కనుగొని అప్పగించాలని బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన ఓ మహిళ కోరారు.


