ఆర్థిక లావాదేవీలతోనే వ్యక్తి హత్య | - | Sakshi
Sakshi News home page

ఆర్థిక లావాదేవీలతోనే వ్యక్తి హత్య

Jun 30 2026 12:13 AM | Updated on Jun 30 2026 12:13 AM

నిందితుడి అరెస్ట్‌

ఉదయగిరి: వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు హత్య కేసులో నిందితుడు షేక్‌ జలీల్‌ను అరెస్ట్‌ చేశారు. ఉదయగిరి సీఐ ఎన్‌.వెంకట్రావు స్థానిక కార్యాలయంలో సోమవారం వివరాలను వెల్లడించారు. గోవిందులు ఈనెల 20వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. పక్కరోజు అతని భార్య నాగరత్తమ్మ వింజమూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 24న దుత్తలూరు మండలం గుండెమడుగల అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మృతదేహం గోనెసంచిలో ఉన్నట్లు బీట్‌ అధికారి ఓంప్రకాశ్‌ పోలీసులకు సమాచారమివ్వగా వెళ్లి పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా జలీల్‌ అనే వ్యక్తి ఊటుకూరు సమీపంలో కౌలుకు నిమ్మ తోటలు సాగు చేస్తున్నట్లు గుర్తించారు. గోవిందులు, నాగరత్తమ్మ ఆ తోటలో కూలీలుగా పనిచేస్తున్నారు. జలీల్‌.. గోవిందుల వద్ద కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. తిరిగి చెల్లించే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. గోవిందులను హత్య చేయాలని జలీల్‌ నిర్ణయించుకున్నాడు. 20వ తేదీన తన తోటలో పనిచేసే రమణయ్య ద్వారా గోవిందులును రప్పించాడు. తోటలో అప్పు విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పథకం ప్రకారం జలీల్‌ గడ్డపారతో గోవిందులు తలపై కొట్టి హత్య చేశాడు. మృతదేహాన్ని గోనెసంచిలో ఉంచి అటవీ ప్రాంతంలో పడేశాడు. నాగరత్తమ్మ ఇచ్చిన సమాచారంతో జలీల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనలో జలీల్‌కు సహకరించిన రమణయ్య పరారీలో ఉన్నాడని, అతడిని త్వరలో అరెస్ట్‌ చేస్తామని సీఐ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement