గంధం బిందెల వద్ద మతపెద్దలు
నెల్లూరు (బారకాసు): రొట్టెల పండగ సందర్భంగా హాజరయ్యే భక్తులకు వసతుల కల్పనే తమ ప్రాధాన్యమని మంత్రులు, ప్రజాప్రతినిధులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో అది వాస్తవ విరుద్ధంగా ఉంది. మండిపోయే ఎండలతో కాళ్లు కాలుతూ భక్తులు హాహాకారాలు చేస్తున్నా.. తాగునీటి వసతి లేక అల్లాడుతున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఏటా నిర్వహించే ఈ మహోత్సవానికి లక్షలాది మంది వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సంఖ్య పెరుగుతుందే గానీ తగ్గేదంటూ ఉండదు. ఇవన్నీ తెలిసినా తమకెందుకులేనని నగరపాలక సంస్థ లైట్ తీసుకుందనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
అన్నీ వెతలే..
● ఆదివారం నాడు భానుడి భగభగలు తారస్థాయికి చేరాయి. అశేషంగా హాజరైన భక్తజనానికి నిలువు నీడ కరువైంది. ఫలితంగా చెట్లు, అవసరమైన జాగా కోసం వీరు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు.
● తాగునీటి సౌకర్యాన్ని కల్పి ంచడంలో కార్పొరేషన్ యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దీంతో గుక్కెడు నీటి కోసం నానా అవస్థలు పడాల్సి వచ్చింది. చలివేంద్రాలను నామమాత్రంగా ఏర్పాటు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని పలువురు పేర్కొన్నారు.
● బారాషహీదులను దర్శించుకునేందుకూ భక్తులకు అగచాట్లు తప్పలేదు. కిలోమీటర్ మేర క్యూ చేరుకుంది. వీరి కాళ్లు కాలకుండా పట్టలను ఏర్పాటు చేసే అవకాశమున్నా.. నీటిని చల్లి ఉపశమనం కల్పించే ఆస్కారమున్నా, ఆ దిశగా ఎవరూ చర్యలు చేపట్టలేదు.
● చాంతాడంత క్యూలో ఉన్న వారికి ఆహారం, మంచినీటిని అందించాలనే కనీస ఆలోచన ఎవరికీ రాకపోవడం శోచనీయం. ఈ వ్యవహారాలను చూస్తే వక్ఫ్ బోర్డు, దర్గా కమిటీ పనితీరు ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
ఎమ్మెల్యే కోటంరెడ్డిని నిలదీసిన భక్తులు
దర్గాకు విచ్చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని భక్తులు నిలదీశారు. గుక్కెడే మంచినీరిచ్చే దిక్కులేదని.. ఎండ వేడిమికి చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, అధికారుల సిఫార్సులున్న భక్తులు దర్గాలోకి నేరుగా వెళ్లి దర్శనం చేసుకోగలుగుతున్నారు. దర్గా ప్రాంగణంలో సిమెంట్ రోడ్డు లేని చోట క్వారీ డస్ట్‌ను వేసి చదును చేశారు. దీనిపై నీరు చల్లాల్సి ఉన్నా, అలా చేయలేదు. దీంతో మట్టి ఎగిరి కళ్లలో పడటంతో భక్తులు అసహనానికి గురయ్యారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించా ల్సిన మేయర్ సుజాత, కమిషనర్ నందన్ తమ ప్రచారం కోసం ఫొటోలకే పరిమితమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతు న్నాయి.
వసతుల కల్పనలో అధికార యంత్రాంగం వైఫల్యం
ఫొటోలకే పరిమితమైన మేయర్, కమిషనర్
షహీదుల సమాధుల దర్శనానికి బారులు
ఆహారం, మంచినీటిని అందించడంలో
వక్ఫ్ బోర్డు నిర్లక్ష్యం
ఏటా పండగ పేరిట
రూ.కోట్లను తమ ఖజానాలో వేసుకుంటున్న వైనం
అధికార పార్టీ నేతలు, ఆఫీసర్ల సిఫార్సులకే ప్రాధాన్యం


