పొగాకు రైతుపై సర్కార్‌ పగ | - | Sakshi
Sakshi News home page

పొగాకు రైతుపై సర్కార్‌ పగ

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

గిట్టుబాటు ధర కల్పించాలనే

డిమాండ్‌తో నిరసన

ట్రాక్టర్లతో భారీ ర్యాలీ

అడ్డుకున్న పోలీసులు

ఆర్డీఓకు వినతిపత్రం అందజేత

సోమశిలలో

38.16 టీఎంసీలు

సోమశిల: సోమశిల జలాశయంలో శనివారం సాయంత్రానికి 38.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ కాలువలకు 3550 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

రాస్తారోకో..

మర్రిపాడు: పొగాకు రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో మర్రిపాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి నిరసనగా నెల్లూరు – ముంబై జాతీయ రహదారిపై రాస్తారోకోను రైతులు చేపట్టి వాహన రాకపోకలను రెండు గంటలకుపైగా అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రైతు నేతలతో పోలీసులు చర్చలు జరిపి ఆందోళనను విరమించాలని కోరారు. అయితే ట్రాక్టర్ల ర్యాలీకి అనుమతిని నిరాకరించడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం రైతు సంఘ నేతలను ఖాకీలు అడ్డుకొని నిరసనను విరమించాలని ఒత్తిడి చేయడంపై కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపైనే పడుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.

ఆత్మకూరు: పొగాకు సాగు ఖర్చులు పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని.. పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధరల్లేక కంపెనీలు కుమ్మకై ్క తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. మంచి ధర కల్పించకపోతే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు నినదించారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలనే డిమాండ్‌తో మర్రిపాడు నుంచి డీసీపల్లి మీదుగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీని సంఘటిత కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు ఆత్మకూరు రైతు సంఘ నేతలు శనివారం నిర్వహించారు. ఆత్మకూరుకు కొన్ని ట్రాక్టర్లు చేరుకోవడంతో స్థానిక నెల్లూరుపాళెం సమీపంలో సీఐ గంగాధర్‌, ఎస్సై జంపాని కుమార్‌ అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతుల్లేవని, పట్టణంలోకి ప్రవేశించరాదని చెప్పడంతో ఇదేమి అన్యాయమని రైతులు ప్రశ్నించారు. ర్యాలీని తాము ప్రశాంతంగా నిర్వహిస్తున్నామని, దీన్ని అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో ట్రాక్టర్లను రోడ్డు పక్కన పెట్టి రైతులు దిగేసి.. అక్కడే నిరసన చేపట్టారు.

సీఎం ఆదేశాలు బేఖాతర్‌

కిలో రూ.200కు తగ్గకుండా ఫ్లాట్‌ఫారాల్లో పొగాకును కొనుగోలు చేస్తారని సీఎం ఇటీవల పేర్కొన్నా, ఆయన ఆదేశాలు బేఖాతరయ్యాయని రైతు సంఘ నేతలు ఆరోపించారు. తేలిక నేలల్లో పండే నాణ్యమైన పొగాకు ఈ ప్రాంతంలో ఉత్పత్తవుతున్నా, దానికి తగిన ధరను చెల్లించకుండా రైతుల వద్ద దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఆపై అక్కడే సీఐకు వినతిపత్రాన్ని అందజేశారు.

ఆర్డీఓకు వినతిపత్రం

ఆత్మకూరు ఆర్డీఓ పావనికి వినతిపత్రాన్ని సంఘటిత కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు అందజేశారు. రైతు సంఘ నేతలు చండ్ర రాజగోపాల్‌, మూలి వెంగయ్య, కృష్ణప్రసాద్‌, లక్ష్మీపతి, అన్వర్‌బాషా, నారాయణస్వామి, ఆత్మకూరు నాగయ్య, శివప్రసాద్‌, బడుగు శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఆర్డీఓకు వినతిపత్రమిస్తున్న రైతులు

మాట్లాడుతున్న నేతలు

ట్రాక్టర్ల ర్యాలీని నిలిపేసిన పోలీసులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement