కావలి (నెల్లూరురూరల్): కావలి పట్టణం కచ్చేరిమిట్టలో గిరిజన మహిళ వివస్త్రను చేసి, పాశవికంగా దాడి చేసిన ఘటనను సామాజిక మహిళా కార్యకర్త సి. శారద శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. సభ్యసమాజం తలదించుకునే ఈ దారుణాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు. ఆధునిక యుగంలో అన్ని రంగాల్లో ముందుకు వచ్చి తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటున్న మహిళలకు ఈ సభ్య సమాజంలో ఇలాంటి దుర్మార్గం జరగడం అత్యంత గర్హనీయం. మహిళలకు అండగా ఉంటామనే అధికార పార్టీ నేతలు నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులను నమోదు చేసి, కఠిన శిక్షలు పడేలా బాధితురాలి వైపు నిలబడాలని డిమాండ్ చేశారు. ఒక మహిళ రాష్ట్రపతిగా ఉన్న ఈ దేశంలో, ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఈ దారుణం జరగడం అత్యంత హేయమన్నారు. కావలి ఘటన చూస్తే.. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన దుర్ఘటను గుర్తు తెస్తుందన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు బాధితురాలిని కలిసి భరోసా ఇవ్వాలని కోరారు. నిందితులు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారో ఆ రాజకీయ పార్టీ వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
పులి వాహనంపై
చాముండేశ్వరిదేవి
ఇందుకూరుపేట: బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గంగపట్నంలో కొలువైన చాముండేశ్వరీదేవి అమ్మవారు పులి వాహనంపై శనివారం విహరించారు. మేళతాళాలు.. విద్యుద్దీప వెలుగులు.. బాణసంచా నడుమ గ్రామం నుంచి పల్లిపాళెం వరకు ఊరేగించారు. కాగా అమ్మవారికి సింహ వాహనసేవను ఆదివారం నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాలను అలయ అర్చకులు అనిల్, రామకృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. ఈఓ తాతా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేత్రపర్వంగా
శ్రీవారి కల్యాణం
రాపూరు: జిల్లాలోని పెంచలకోన క్షేత్రం భక్తులతో శనివారం కిక్కిరిసింది. పెనుశిల లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మీదేవి, ఆంజనేయస్వామికి సుప్రభాతం, అభిషేకం, పూలంగిసేవను నిర్వహించారు. స్వామి వారి నిత్య కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి వివిధ పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దేవదేవేరుల కల్యాణాన్ని అత్యంత వేడుకగా నిర్వహించారు. అన్నదానం చేశారు. దేవదేవేరుల ఉత్సవ విగ్రహాలను తిరుచ్చిపై ఉంచి సహస్రదీపాలంకరణ మండపంలో ఊంజల్ సేవను నిర్వహించారు.


