వరికుంటపాడు: మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధికి ఎఫ్‌డీఆర్ పేరుతో రూ.4.70 లక్షల విలువైన కాంట్రాక్ట్ పనులు బీజేపీ నేతకు అప్పజెప్పారు. అదే అదనుగా సదరు వ్యక్తి చెరువు అభివృద్ధి పనులను గాలికొదిలేసి అవినీతి పనులకు పదునుపెట్టాడు. వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ వేప, నల్లతుమ్మ, తెల్లతుమ్మ చెట్లను నరికి వేస్తూ జేబులు నింపుకుంటున్నాడు. అంతటితో ఆగకుండా చెరువు కింద ఆయకట్టు కాలువ అభివృద్ధి అని చెప్పి కాలువకు రెండు వైపులా రూ.లక్షల విలువ చేసే టేకు, వేపచెట్లను తొలగించడం అతని అక్రమాలకు పరాకాష్టగా చేరింది. కనీసం ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా చెట్లను తొలగించడంపై పోలీస్‌స్టేషన్‌లో ఆ నాయకుడిపై గ్రామస్తులు, రైతులు ఫిర్యాదు చేశారు.
తీవ్ర విమర్శలు
తూర్పుకొండారెడ్డిపల్లి చెరువుతో పాటు పక్కన ఉండే చెట్ల నరికివేతపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు అభివృద్ధి పనులు చేస్తున్నారా లేక అవినీతి పనులు చేస్తున్నారా అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. చెరువు కట్టకు ఇరువైపులా ఉండే రైతుల పొలాల హద్దుల్లో సంవత్సరాల తరబడి చెట్లను కాపాడుకుని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా చెట్లను కొట్టడంపై శుక్రవారం గ్రామస్తులందరూ ఎదురు తిరిగి కర్ర తరలించకుండా అడ్డుకున్నారు. కాగా దీనిపై కూటమి నేతల్లో సైతం కుమ్ములాటకు దారితీస్తోంది.
అభివృద్ధి ముసుగులో
వాల్టా చట్టానికి తూట్లు
ఇష్టానుసారంగా వృక్షాల నరికివేత
రైతుల పొలాల్లోని టేకు చెట్లకు ఎసరు
సదరు నేతపై పోలీసులకు ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు మూడు పువ్వులు, ఆరు కాయలు అనే చందంగా మారింది. చేపట్టే ప్రతి పనిలోనూ ఏదో ఒక విధంగా అక్రమాలకు తెరలేపుతున్నారు అధికార పార్టీ నేతలు. మండలంలోని తూర్పుకొండారెడ్డిపల్లిలో చెరువు అభివృద్ధి పేరుతో బీజేపీ నేత పక్కనే ఉన్న రైతుల పొలాల్లో ఉండే విలువైన టేకు చెట్లను సైతం కొట్టి తరలిస్తుండడంతో
స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెట్లను నరకకూడదు
తూర్పుకొండారెడ్డిపల్లి చెరువు కట్ట అభివృద్ధి కోసం రూ.4.75 లక్షల నిధులు కేటాయించాం. ఈ చెరువు కట్ట మీద జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పాం. కానీ చెరువు లోపల ఉండే వేప, నల్లతుమ్మ చెట్లు నరికివేతపై మాకు సంబంధం లేదు. ఆ చెట్లు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించినది. రైతు పొలాల్లో ఉండే చెట్లు నరకకూడదు. – ఆది రమేష్, ఇన్‌చార్జి ఇరిగేషన్ ఏఈ


