తన టిప్పరే మృత్యు శకటమైంది | - | Sakshi
Sakshi News home page

తన టిప్పరే మృత్యు శకటమైంది

Jun 28 2026 7:42 AM | Updated on Jun 28 2026 7:42 AM

మరమ్మతులు చేస్తుండగా

డ్రైవర్‌ దుర్మరణం

ముత్తుకూరు(పొదలకూరు): తను ప్రతినిత్యం తోలే టిప్పరే ఆ డ్రైవర్‌కు మృత్యు శకటంగా మారింది. టిప్పర్‌ కింద పడుకుని రిపేరు చేస్తున్న డ్రైవర్‌పైకి ప్రమాదవశాత్తు టిప్పర్‌ దొర్లడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాద ఘటన మండలంలోని జంగాలకండ్రిక వద్ద శనివారం జరిగింది. ముత్తుకూరు ఎస్సై డీవీ కొండారెడ్డి కథనం మేరకు.. తోటపల్లిగూడూరు మండలం వరకవిపూడి గ్రామానికి చెందిన నల్లబాయి విజయ్‌కుమార్‌(36) టిప్పర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టిప్పర్‌ మరమ్మతులకు గురికావడంతో జంగాలకండ్రిక గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి సరిచేస్తుండగా ఒక్కసారిగా టిప్పర్‌ వెనుక్కు దొర్లింది. దీంతో టిప్పర్‌ కింద ఉన్న విజయకుమార్‌ టైర్ల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ నిర్వహించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

టైర్‌ పంక్చరై అదుపుతప్పిన

ఎలక్ట్రిక్‌ బస్సు

స్వల్ప గాయాలతో

బయటపడిన ప్రయాణికులు

మనుబోలు: వేగంగా వెళ్తున్న ఎలక్ట్రిక్‌ బస్సు హఠాత్తుగా టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపు తప్పింది. ఈ ఘటన మనుబోలు, వెంకటాచలం మండలాల సరిహద్దులోని జాతీయ రహదారిపై చవటపాళెం క్రాస్‌రోడ్డు వద్ద శనివారం జరిగింది. వివరాలు.. తిరుపతి నుంచి 35 మంది ప్రయాణికులతో ఆర్టీసీ ఎలక్ట్రికల్‌ బస్సు నెల్లూరు వైపు వస్తోంది. బస్సు చవటపాళెం రోడ్డు వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా ముందు టైరు పగిలిపోవడంతో అదుపుతప్పింది. అయితే డ్రైవర్‌ చాకచక్యంగా బస్సును పక్కనే ఉన్న పొలాల్లోకి మళ్లించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో స్వల్పగాయాలైన ప్రయాణికులను 108 అంబులెన్స్‌లో వెంకటాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అధికారులు ప్రయాణికులను వేరే బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చారు. మనుబోలు ఎస్సై శివరాకేష్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిరంతర పర్యవేక్షణ

అవసరం

నెల్లూరు(క్రైమ్‌): రొట్టెల పండగ నేపథ్యంలో నిరంతర పర్యవేక్షణ అవసరమని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. బారాషహీద్‌ దర్గాలో బందోబస్తును శనివారం ఆయన పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వాహనాలను పార్కింగ్‌ ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలన్నారు. ప్రత్యేక పాస్‌లు కలిగిన వాహనాలు మినహా ఇతర వాహనాలు దర్గాలోపలికి అనుమతించరాదన్నారు. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌స్క్వాడ్‌లతో నిరంతర తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించినా, గైర్హాజరైనా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ అజిత వేజెండ్ల, ఏఎస్పీలు సౌజన్య, దీక్ష ఉన్నారు.

నాలుగు డ్రోన్‌ కెమెరాలు

భక్తుల భద్రతను పటిష్టం చేసేందుకు పోలీసుశాఖ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చింది. మంత్రి పొంగూరు నారాయణ నాలుగు నైట్‌ విజన్‌ డ్రోన్‌ కెమెరాలను ఎస్పీ అజితకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రివేళల్లోనూ నిరంతర ఏరియల్‌ సర్వైలైన్స్‌ నిర్వహిస్తామన్నారు. వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌, కమిషనర్‌ నందన్‌, టీడీపీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి ఉన్నారు.

భక్తిశ్రద్ధలతో ప్రాకారోత్సవం

నెల్లూరు(బృందావనం): త్రయోదశి సందర్భంగా మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం రాత్రి స్వామివారికి చిన్నవెండినంది ప్రాకారోత్సవం వేడుకగా నిర్వహించారు. భక్తులు స్వామివార్లను, నందీశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement