● జిల్లాలో ఐదేళ్లలోపు
చిన్నారులు 2,67,750 మంది
● 6,656 పోలియో బూత్‌ల ఏర్పాటు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో శిశు పక్షవాతం(పోలియో)ను నివారించేందుకు ఆదివారం నుంచి మూడ్రోజుల పాటు పోలియో చుక్కల మందును వైద్యశాఖ ఆధ్వర్యంలో వేయనున్నారు. ఇటీవల ఇంటింటి సర్వే చేసి అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్లలోని చిన్నారులు జిల్లాలో 2,67,750 మంది ఉన్నట్టు వైద్యశాఖ లెక్కలు తేల్చింది. జిల్లాలో 52 పీహెచ్‌సీలు, 28 అర్బన్‌హెల్త్ సెంటర్లు, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఒక ట్రాన్సిట్ కేంద్రం పరిధిలో చుక్కల మందు వేస్తారు. మొత్తం 1,620 బూత్‌లతో పాటు 83 మొబైల్ బూత్‌లు, 88 ట్రాన్సిట్ బూత్‌లు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లలో చుక్కల మందు వేసేందుకు 6,656 మందిని నియమించారు. అలాగే రూట్ సూపర్‌వైజర్లు 252 మందిని, మొబైల్ టీమ్స్‌లో 166 మందిని కలిపి మొత్తం 7,074 మంది సేవలందించనున్నారు. 5,206 వ్యాక్సిన్ క్యారియర్స్‌ను, 78 పెద్ద కోల్డ్ బాక్సులను ఏర్పాటు చేసి జాగ్రత్తగా పోలియో కేంద్రాలకు చేర్చారు. మొదటి రోజు పోలియో బూత్‌ల వద్ద చుక్కల మందువేస్తారు. మందు వేయించిన చిన్నారికి ఓటర్ లాగానే వేలికి సిరా చుక్క వేస్తారు. రెండోరోజు, మూడో రోజు ఇంటింటి సర్వే ద్వారా ఎక్కడైనా పిల్లలు మిగిలిపోయి ఉంటే వారికి కూడా చుక్కల మందు వేస్తారు. నగరంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.


