నెల్లూరు (క్రైమ్): వరికుంటపాడు మండలం గణేష్‌పురానికి చెందిన ఎస్. రవీంద్రరెడ్డిని కొండాపురం పోలీసులు అక్రమంగా నిర్బంధించి కొట్టారంటూ సామాజిక మాధ్యమాలు, కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలు పూర్తి అవాస్తవమని కావలి డీఎస్పీ వీవీ రమణకుమార్ స్పష్టం చేశారు. శనివారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కలిగిరి సీఐ సుబ్బారావుతో కలిసి మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. డీఎస్పీ మాట్లాడుతూ రవీంద్రరెడ్డిపై కొండాపురం పోలీసుస్టేషన్‌లో రౌడీషీట్ ఉందనీ, ప్రతి ఆదివారం పోలీసుస్టేషన్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావడం లేదని, ఇదే సమయంలో నగదు తీసుకుని మోసగించాడంటూ ఒకరు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఎస్సై అతన్ని తీసుకురావాలని ఇద్దరు కానిస్టేబుల్స్‌ను పంపగా వారిపై రవీంద్రరెడ్డి దురుసుగా ప్రవర్తించారన్నారు. అనంతరం ఆయన్ను పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చి ఫిర్యాదుపై విచారించి, సత్ప్రవర్తనతో ఉండాలని స్థానిక తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసి పంపించినట్లు తెలిపారు.


