అరాచకాలను గమనిస్తున్నారు.. | - | Sakshi
Sakshi News home page

అరాచకాలను గమనిస్తున్నారు..

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

బాబు పాలనలో కరువే..

రైతుల ప్రయోజనాలే లక్ష్యం

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని నిర్వీర్యం చేసిన చంద్రబాబు

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వందలాది మందితో సోమశిల

జలాశయ సందర్శన

ఆత్మకూరు: రాయలసీమ ఎత్తిపోతల పథకం సాధన కమిటీ ద్వారా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ను సాధించుకునేందుకు ప్రాణాలర్పించేందుకైనా సిద్ధమని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం చేపట్టిన చలో సోమశిల కార్యక్రమం విజయవంతమైంది. దీనికి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, వెంకటగిరి, నెల్లూరు రూరల్‌ నియోజకవర్గాల సమన్వయకర్తలు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో కాకాణి మాట్లాడారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కుదుర్చుకున్న లోపాయికారీ ఒప్పందంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్కడి సీఎం మాటలతో ఈ విషయం తేటతెల్లమైందని చెప్పారు. దేశంలో చంద్రబాబు లాంటి రైతు ద్రోహి మరెవరూ ఉండరని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతాంగ ప్రయోజనాల కోసం జలయజ్ఞం పనులను దివంగత సీఎం వైఎస్సార్‌ చేపట్టారని గుర్తుచేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలనే మహోన్నత ఆశయంతో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకానికి గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేసి రూ.3500 కోట్లను వెచ్చించి 50 శాతం మేర పూర్తి చేశారని వివరించారు. అయితే ఇది పూర్తయితే ఆయనకు ఎక్కడ మంచి పేరొస్తుందనే ఉద్దేశంతో నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇలాంటి చీకటి ఒప్పందాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్‌ ఎత్తు పెంచుతూ భూసేకరణ చేస్తోందని, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. చంద్రబాబు దాని ఊసెత్తడంలేదని విమర్శించారు. రైతాంగం నష్టపోతే వారి శాపాలు బాబుకు తప్పవని స్పష్టం చేశారు.

విడ్డూరంగా టీడీపీ నేతల వ్యాఖ్యలు

పర్యావరణ అనుమతుల్లేవంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని, అయితే ఎలాంటి పర్మిషన్లు లేకుండానే వివిధ రూపాల్లో ఎనిమిది టీఎంసీలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతుండటం వారికి కనిపించడంలేదానని ప్రశ్నించారు. నెల్లూరు, సంగం బ్యారేజీల నిర్మాణాన్ని గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేశారని చెప్పారు. గత టీడీపీ పాలనలో సోమశిల జలాశయాన్ని 36 టీఎంసీలకు మించి నింపలేదని, అయితే ముంపు ప్రాంతాల వారికి నష్టపరిహారాన్ని దివంగత సీఎం వైఎస్సార్‌ చెల్లించి తొలిసారిగా 72 టీఎంసీలను నిల్వ చేశారని తెలిపారు. కూటమి రెండేళ్ల పాలనలో బ్యారేజీల పేర్లు తొలగించడం మినహా ఏమి చేశారని ప్రశ్నించారు. రైతులకు యూరియానే అందించలేని చంద్రబాబు.. భవిష్యత్తులో సాగునీటినీ ఇవ్వలేరని దుయ్యబట్టారు. ఉద్యమంలా వస్తున్న తమ పార్టీ శ్రేణులను అడ్డుకునేందుకు వందలాది మంది ఖాకీలను మోహరించారని, ఇలా చేస్తుండటంతోనే రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ దెబ్బతిని శాంతిభద్రతలు ప్రశ్నార్థకంగా మారాయని చెప్పారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను సాధించేంత వరకు పోరాటాలను చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఆదిశేషయ్య, పార్టీ మున్సిపల్‌ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్‌రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, పార్టీ మండల కన్వీనర్లు బిజివేముల పిచ్చిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీలు పద్మజారెడ్డి, పెయ్యల సంపూర్ణమ్మ, రఘునాథరెడ్డి, మాజీ సర్పంచ్‌ లక్ష్మీదేవి, కల్పనారెడ్డి, రహీం, కొప్పోలు వెంకటేశ్వర్లు, లింగాబత్తిన హరీష్‌, బాలఅంకయ్య, రాజశేఖర్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అడ్డుకున్న పోలీసులు

జలాశయ గేట్లను డీఎస్పీ వేణుగోపాల్‌, సీఐ గంగాధర్‌, పోలీసులు మూసేసి పార్టీ శ్రేణులను అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. జలాశయ మనుగడను కాపాడేందుకు.. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ సాధన కోసమే చలో సోమశిల కార్యక్రమాన్ని చేపట్టామని నేతలు తెలిపారు. దీంతో కొద్ది మంది వెళ్లేందుకు అనుమతిచ్చారు. పోలీసుల ఆంక్షలను సైతం లెక్కచేయకుండా జై జగన్‌.. రైతు ద్రోహి చంద్రబాబు అని భారీగా నినాదాలు చేశారు. డ్యామ్‌ వద్దకు నేతలతో భారీగా చేరుకున్నారు.

జలాశయ సందర్శనకు ర్యాలీగా వస్తున్న నేతలు

బహిరంగ సభలో మాట్లాడుతున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డి

ప్రాజెక్ట్‌ను సందర్శిస్తే ప్రభుత్వానికి నష్టమేమిటి..?

కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు చేస్తున్న అరాచకాలను రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రైతాంగానికి విఘాతం కలిగేలా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాన్ని చంద్రబాబు గ్రహణం పట్టించారని ఆరోపించారు. దీన్ని నిర్వీర్యం చేస్తే కావలికి సాగునీరు ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కృషి చేయాలని కోరారు.

సోమశిల ప్రాజెక్ట్‌ను తాము సందర్శిస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమిటని కాకాణి ప్రశ్నించారు. వారి చీకటి ఒప్పందాలను ప్రజల ముందుకు తెస్తున్నామనే భయంతోనే తమ గొంతు నొక్కేందుకు అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక ఆంక్షలకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు ద్రోహిగా మారిన చంద్రబాబును బ్రిటిష్‌ పాలకులను తరిమినట్లే రాష్ట్ర ప్రజలు త్వరలోనే తరిమికొడతారని పేర్కొన్నారు. రాయలసీమ అని ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌ కేవలం చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించిందని, జిల్లాకు ఏమి ఉపయోగం ఉంటుందని కొందరు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

రైతులకు మేలు చేసింది వైఎస్సార్‌ కుటుంబమేనని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బాబు పాలనలో కరువు కాచుకొని ఉంటుందని చెప్పారు. జలయజ్ఞం ద్వారా ఎన్నో ప్రాజెక్టులను నిర్మించి.. సాగునీటిని అందించి పాడి పంటలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత దివంగత వైఎస్సార్‌కే దక్కుతుందని కొనియాడారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకం ద్వారా సోమశిల జలాశయానికి అదనపు జలాలొచ్చేలా గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో చర్యలు చేపడితే, దాన్ని కూటమి ప్రభుత్వం నిలిపేయడం దారుణమని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement