సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రొట్టెల పండగకు సర్వం సిద్ధమైంది. కోర్కెల రొట్టెల కోసం దేశ, విదేశాల నుంచి తరలివస్తున్నారు. భక్తజన తరంగాలతో స్వర్ణాల చెరువు సరికొత్త శోభను సంతరించుకుంది. శుక్రవారం నుంచి ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు పండగను అంగరంగవైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. దర్గా ప్రాంగణం కళకళలాడుతోంది.
ఏర్పాట్లు పూర్తి
సొందల్‌మాలిని శుక్రవారం.. గంధ మహోత్సవాన్ని శనివారం.. రొట్టెల పండగను ఆదివారం.. తహలీల్ ఫాతేహాను సోమవారం.. ముగింపు వేడుకలను మంగళవారం నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. పారిశుధ్యానికి పెద్ద పీటేస్తూ దాదాపు ఆరు వేల మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తించేలా కేటాయించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం చేసింది. దర్గా ప్రాంగణం, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించనున్నారు.
గజ ఈతగాళ్లతో నిరంతర గస్తీ
స్వర్ణాల చెరువులో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలను మత్స్యశాఖ చేపట్టింది. 15 బోట్లు.. షిఫ్ట్‌కు 15 మంది చొప్పున మొత్తం 45 మంది గజ ఈతగాళ్లను నియమించారు. ప్రకాశం, బాపట్ల, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి 125 మంది అగ్నిమాపక సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు.
రొట్టెలు మార్చుకుంటూ..
స్వర్ణాల చెరువులో కేరింతలు కొడుతూ..
రొట్టెల పండగకు సర్వం సిద్ధం
నేటి నుంచి ఐదు రోజుల పాటు
నిర్వహణ
దేశ, విదేశాల నుంచి వస్తున్న భక్తజనం
సందడిగా దర్గా ప్రాంగణం


