నెల్లూరు(వీఆర్సీసెంటర్): మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం సెలవైనా జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేయనున్నాయని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు
లింగ నిర్ధారణ చేస్తే
కఠిన చర్యలు
నెల్లూరు(అర్బన్): జిల్లాలో ఎక్కడైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేశారని తెలిస్తే సదరు వైద్యులపై కఠిన చర్యలు చేపడతామని డీఎంహెచ్‌ఓ సుజాత స్పష్టం చేశారు. గర్భస్థ లింగ నిర్ధారణ నిషేధ చట్టంపై జిల్లా స్థాయి సలహా మండలి సభ్యులతో సంతపేటలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ చట్టాన్ని స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులు ఉల్లంఘించారని తెలిస్తే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 2447ను సంప్రదించాలని కోరారు. చట్టం కింద రిజిస్టరైన ప్రతి డాక్టర్.. గర్భిణులకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో ఫారం – ఎఫ్‌లో తప్పక నమోదు చేయాలని కోరారు. చట్ట జిల్లా స్థాయి సలహా సంఘ చైర్‌పర్సన్ డాక్టర్ కిరణ్, పీడియాట్రిక్స్ అసోసియేషన్ ప్రొఫెసర్ లక్ష్మీప్రసన్న, అనాటమీ అసోసియేట్ ప్రొఫెసర్ స్వర్ణారెడ్డి, డీఐఓ ఉమామహేశ్వరి, డెమో అధికారి కనకరత్నం, ఎన్జీఓలు కవితారెడ్డి, శ్రీనివాసరావు, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.
మరోసారి ప్రభుత్వ భూముల ఆక్రమణ..?
● గతంలోనూ వివాదాలు
మర్రిపాడు: మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ, కొండ పొరంబోకు భూముల ఆక్రమణలపై గతంలో ఆరోపణలు వెల్లువెత్తగా, తాజాగా పెగళ్లపాడులోని సర్వే నంబర్ 6లో భూమిని చదును చేసి కబ్జాకు యత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. 34 ఎకరాల పరిధిలోని భూమిలో 12 ఎకరాలను చదును చేసి ఆక్రమించేందుకు గ్రామానికి చెందిన డీలర్ దుద్దుకుంట శేఖర్ యత్నించారని పేర్కొన్నారు. ఇదే ప్రాంతంలో గతంలో సుమారు 12 ఎకరాలు కబ్జాకు గురయ్యాయని తెలిపారు. గ్రామంలోని ప్రభుత్వ భూములపై వివాదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అప్పట్లో ఫిర్యాదు చేసినా, శాశ్వత చర్యలు కానరావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం ప్రత్యేక సర్వేను నిర్వహించి.. ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.


