నేతల గుప్పెట్లో పండగ
నెల్లూరు(బృందావనం): రొట్టెల పండగ. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. శుక్రవారం నుంచి మంగళవారం వరకు ఐదురోజులపాటు నెల్లూరులోని బారాషహీద్ దర్గాలో జరుగుతుంది. అయితే పండగలో ‘కూటమి’ పెద్దల జోక్యం మితిమీరిపోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి రాజకీయంగా అనుకూలంగా ఉన్నవారికి బాధ్యతలు అప్పగించారనే అసంతృప్తి ముస్లిం సామాజిక వర్గంలో వ్యక్తమవుతోంది. అటు ఆర్థిక, ఇటు రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచనలతో కొందరు కూటమి పెద్దలు చేసిన నిర్వాకం ఇప్పుడు చర్చకు దారి తీసింది. వారి తీరును ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని లోలోన మదనపడుతున్నారు.
తమవారికే అవకాశం
గతంలో సంప్రదాయాలపై అవగాహన ఉన్న 20 నుంచి 30 మంది సభ్యులతో ఫెస్టివల్ కమిటీలు ఏర్పాటు చేసి ఎలాంటి వివాదాలకు తావులేకుండా పండగ నిర్వహించేవారనేది కొందరి మతపెద్దలు మాట. ప్రస్తుతం రాజకీయ జోక్యం పెరగడంతో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కమిటీ ఏర్పాటులో తమ అనుయాయులకు, తమకు అనుకూలంగా ఉండేవారికి అవకాశాలు కల్పించారనే విమర్శలున్నాయి. పండగ నిర్వహణపై అవగాహన ఉన్నవారు ఉంటే లోటుపాట్లను ప్రశ్నించే అవకాశం ఉంటుందని, అయితే ఇలాంటి అవకాశం లేకుండా చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు మాజీ చైర్మన్, మతపెద్ద సయ్యద్ సమీ దర్గా సంప్రదాయాలు సక్రమంగా పాటించడం లేదని, ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయాల జోక్యం ఏమిటంటూ ప్రశ్నించడం దుమారం రేపింది.
డిప్యూటీ మేయర్ దూరం
రొట్టెల పండగ ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశాలకు డిప్యూటీ మేయర్ తహసీన్ హాజరుకాకపోవడంపై కూడా చర్చ జరుగుతోంది. మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్, ఎస్పీ తదితరులతో జరిగిన సమావేశాల్లో మేయర్ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అయితే ముస్లిం వర్గానికి చెందిన డిప్యూటీ మేయర్‌ను ఆహ్వానించారా? లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆహ్వానం ఉన్నప్పటికీ కొందరి ఆధిపత్య ధోరణుల కారణంగా ఆమె దూరంగా ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది.
మితిమీరి..
ధార్మిక కార్యక్రమాల్లో కొందరు కూటమి నేతలు మితిమీరి రాజకీయ పెత్తనం చేయడం ముస్లిం వర్గాన్ని అసహనానికి గురిచేస్తోందని సమాచారం. రొట్టెల పండగలో గంధమహోత్సవం ప్రధాన ఘట్టం. 12 గంధం బిందెలుతో ఉత్సవం భక్తిప్రపత్తులతో వేడుకగా సాగుతుంది. గతేడాది ఏ మాత్రం అవగాహన లేని వారు గంధాన్ని లేపనం చేసి తమతో తీసుకెళ్లిపోయారన్న విమర్శలు వచ్చాయి. ఈ సంవత్సరం అటువంటి లోటుపాట్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా భక్తిభావం, ధార్మిక కార్యక్రమాలపట్ల అవగాహన ఉన్న వారిని గంధ మహోత్సవానికి ఎంపిక చేస్తే బాగుంటుందని మతపెద్దలు ఆనాటి ఘటనలను గుర్తుచేసుకుని చెబుతున్నారు. కూటమి పెద్దలు తమకు అనుకూలమైన 12 మందిని గంధ మహోత్సవానికి ఎంపిక చేసే ప్రక్రియలో తలమునకలై ఉన్నారని సమాచారం.
మితిమీరిన ఆయా పార్టీల పెద్దల జోక్యం
సంప్రదాయాలు తెలిసిన వారిని దూరం పెట్టి..
అవగాహన లేని వారికి అందలం
ప్రశ్నిస్తే ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని మౌనం
బారాషహీద్ దర్గా రొట్టెల పండగను రాజకీయ నాయకులు తమ ఆధిపత్యంలోకి తీసుకున్నారని నెల్లూరు జిల్లా సాదత్ మషాయీఖ్ వెల్ఫేర్ కమిటీ (మహనీయులు పూర్వీకుల వంశావళి, పీఠాధిపతుల సంక్షేమ సంఘం) ఆందోళన వ్యక్తం చేసింది. సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, గంధ మహోత్సవం పవిత్రతను కూడా విస్మరిస్తున్నారని ఆరోపించింది. చిన్నబజార్‌లోని నెల్లూరు పెద్ద దర్గాలోని సయ్యద్ ఖాజాపీర్ మకాన్ అసార్‌ఘర్‌లో గురువారం పీఠాధిపతి కేఎస్‌ఎస్ బాబాసాహెబ్ బందానవాజ్, సాదత్ సయ్యద్ ఫయాజ్ రిజ్వీ, సర్దార్ హుస్సేన్ సాహిబ్, అబుల్ హసన్ హుస్సేన్ సాహిబ్, మౌలానా ఇస్తియాఖ్ అహ్మద్‌లు మాట్లాడారు. ప్రస్తుతం జరుగుతున్న రొట్టెల పండగ, బారాషహీద్ దర్గా గంధ మహోత్సవంలో స్థానిక మత పెద్దలు, సాదత్ పూర్వీకుల వంశావళి (మషాయీఖ్)కి తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నప్పటికీ స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇష్టానుసారంగా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సంప్రదాయాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు.


