● లారీని ఢీకొట్టిన ఆటో
● 10 మంది మహిళలకు తీవ్రగాయాలు
మనుబోలు: ఆ మహిళలంతా ఇంటి నుంచి కూలీ పనికి బయలుదేరారు. అయితే హైవేపై లారీ ఆగి ఉంది. దీనిని ఆటో ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోయింది. మరో 10 మంది, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మనుబోలు మండల కేంద్రం పరిధిలోని జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని మడమనూరు సమీపంలో ఉన్న రొయ్యల ఫ్యాక్టరీకి గూడూరు మండలం చెన్నూరు నుంచి మహిళా కూలీలతో ఆటో వెళ్తోంది. పోలీస్‌స్టేషన్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న సీహెచ్ సంతోషి, లక్ష్మి, టి.ఉష, ఎం.శివకుమారి, జి.సుజాత, పి.బుజ్జమ్మ, ఎస్‌కే హుస్సేన్‌బీ, కె.శ్రీలత, ఎం.మంగమ్మ, ఎస్‌కే జిలేఖ, విజయలక్ష్మి, డ్రైవర్ శివకుమార్ తదితరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంతో మహిళలంతా చెల్లాచెదురుగా పడిపోయారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా కొద్దిసేపు భయానకంగా మారింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గూడూరు, నెల్లూరులోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో తీవ్రంగా గాయపడిన గూడూరు మాళవ్యా నగర్‌కు చెందిన సీహెచ్ సంతోషి (26) నెల్లూరులో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈమెకు భర్త రాంబాబు, ఇద్దరు పిల్లలున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
అడ్డదిడ్డంగా పార్కింగ్
మండల పరిధిలోని జాతీయ రహదారిపై పలుచోట్ల లారీలను ఇష్టానుసారంగా పార్కింగ్ చేస్తున్నారు. మనుబోలు బీసీ కాలనీ దారి, కాగితాలపూరు క్రాస్‌రోడ్డు, కొండూరుసత్రంలోని హోటళ్ల వద్ద నిత్యం రోడ్డుపైనే పదుల సంఖ్యలో లారీలు ఆపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల ఎదురుగా బీసీ కాలనీ వద్ద ఈ పరిస్థితి ఉంది. దీంతో నిత్యం రద్దీ గా ఉండే హైవే ఇరుకుగా మారి తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. లారీలను అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలుపుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు.


