ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ప్రత్యేక బస్సుల ఏర్పాటు

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి

52 సర్వీసులు

నెల్లూరు సిటీ: నెల్లూరు బారాషహీద్‌ దర్గాలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్న రొట్టెల పండగకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షమీమ్‌ తెలిపారు. గురువారం ఆమె వివరాలు వెల్లడించారు. నెల్లూరు నుంచి కసుమూరుకు 20, రైల్వేస్టేషన్‌ నుంచి కసుమూరుకు 10, వెంకటాచలం నుంచి కసుమూరుకు 2, నెల్లూరు నుంచి ఏఎస్‌పేటకు 8, ఆత్మకూరు నుంచి ఏఎస్‌పేట మీదుగా నెల్లూరు వరకు 12 బస్సులు నడపనున్నట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో సీ్త్ర శక్తి, దివ్యాంగ శక్తి పథకాలు వర్తిస్తాయని పేర్కొన్నారు.

● రొట్టెల పండగకు వచ్చే భక్తుల కోసం నెల్లూరు నుంచి చైన్నెకి 2, బెంగళూరుకు 4, కడపకు 3, విజయవాడకు 5 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు షమీమ్‌ తెలిపారు. ఈనెల 28వ తేదీన ఏఎస్‌పేట నుంచి హైదరాబాద్‌కు 2, ఏఎస్‌పేట నుంచి బెంగళూరుకు 1 ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు వెల్లడించారు.

కారు, ఆటో ఢీ

ముగ్గురికి తీవ్రగాయాలు

జలదంకి(కావలి): జలదంకి మండలం లింగరాజుఅగ్రహారం క్రాస్‌రోడ్డు వద్ద గురువారం కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. కావలి నుంచి జలదంకి మండలం నాగిరెడ్డిపాళేనికి ఇద్దరు మహిళా ప్రయాణికులతో వెళ్తున్న ఆటో, జలదంకి మండలం బ్రాహ్మణక్రాక నుంచి కావలి వైపు వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలోని శాంతమ్మ, అలేఖ్య, డ్రైవర్‌ శ్రీకాంత్‌ తీవ్రంగా గాయపడ్డారు. కారులోని ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఆటో మూడు భాగాలుగా విడిపోయి రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోవడంతో ఆ ప్రాంతమంతా బీభత్సంగా మారింది.

మద్యం మత్తులో

యువకుడి హల్‌చల్‌

జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు

అంతరాయం

బుచ్చిరెడ్డిపాళెం: పట్టణంలోని ముంబై జాతీయ రహదారిపై గురువారం మద్యం మత్తులో ఓ యువకుడు హల్‌చల్‌ చేసి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించాడు. ద్విచక్ర వాహనాన్ని రహదారిపై అడ్డంగా నిలిపివేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులతో అతను వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు కల్పించుకుని యువకుడిని శాంతింపజేయడానికి ప్రయత్నించినా వినిపించుకోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement