నేటి నుంచి విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు

Jun 26 2026 7:15 AM | Updated on Jun 26 2026 7:15 AM

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): విద్యుత్‌ భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు శుక్రవారం నుంచి జూలై 2వ తేదీ వరకు విద్యుత్‌ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ జిల్లా సర్కిల్‌ ఎస్‌ఈ రాఘవేంద్రం తెలిపారు. గురువారం నెల్లూరులోని విద్యుత్‌ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సామర్థ్యం, నిబంధనల అమలు, జాగ్రత్త, విద్యుత్‌ భద్రతను నిర్ధారించడం’ అనే నినాదంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విద్యుత్‌ ప్రమాదాలను తగ్గించడం, వినియోగదారుల్లో భద్రతా అవగాహన పెంచడం వారోత్సవాల ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని విద్యుత్‌ డివిజన్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. విద్యుత్‌ పనులు చేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ ప్రమాదాల నివారణకు ప్రజలు నాణ్యమైన విద్యుత్‌ వైర్లు వినియోగించాలని, విద్యుత్‌ లోడ్‌కు అనుగుణంగా పరికరాలు వాడాలని సూచించారు. దెబ్బతిన్న వైర్లు, పాత వైరింగ్‌ను మార్చుకోవాలని, ఎర్తింగ్‌ సదుపాయం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. ఏసీలు, ఇతర విద్యుత్‌ పరికరాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించుకోవడంతోపాటు లైసెన్స్‌ కలిగిన ఎలక్ట్రీషియన్లతోనే పనులు చేయించుకోవాలని సూచించారు. వారోత్సవాల సందర్భంగా విద్యుత్‌ సిబ్బంది వినియోగదారులకు భద్రతా చర్యలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement