రైల్లో బాల కార్మికుల తరలింపు | - | Sakshi
Sakshi News home page

రైల్లో బాల కార్మికుల తరలింపు

Jun 25 2026 12:30 AM | Updated on Jun 25 2026 12:30 AM

సంరక్షించిన అధికారులు

నెల్లూరు(క్రైమ్‌): బిహార్‌ రాష్ట్రానికి చెందిన బాలురను రైల్లో అక్రమంగా తరలిస్తుండగా రైల్వే పోలీసులు ఇతర శాఖలను సమన్వయం చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సంరక్షించారు. వారి కథనం మేరకు.. బిహార్‌ రాష్ట్రానికి చెందిన బాలురను పనుల నిమిత్తం తమిళనాడు రాష్ట్రం ఈరోడ్‌కు అమృత్‌ భారత్‌ రైల్లో తరలిస్తున్నారని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ మంగళవారం రాత్రి నెల్లూరు రైల్వే పోలీసులకు సమాచారం అందించింది. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్‌, సీఐ ఎ.సుధాకర్‌ నేతృత్వంలో నెల్లూరు, గూడూరు రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌, ఎహెచ్‌టీయూ, డీసీపీఓ సిబ్బంది బృందంగా ఏర్పడ్డారు. రైలు గూడూరులో ఆగగానే బృందం తనిఖీలు చేపట్టారు. నాయుడుపేటకు చేరుకునేలోపే వివిధ బోగీల్లో అక్రమంగా తరలిస్తున్న 14 మంది బాలురను సంరక్షించారు. వారిని పనుల నిమిత్తం ఈరోడ్‌కు తీసుకెళ్తున్న బిహార్‌ రాష్ట్రానికి చెందిన ఎండీ అబ్బాస్‌, వాదూద్‌, మహబూబ్‌, నజీమ్‌, అబ్బాస్‌తోపాటు మరో ఇద్దరు ఏజెంట్లను అదుపులోకి తీసుకుని నెల్లూరుకు తరలించారు. బాలురను చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ముందు హాజరుపరిచిన అనంతరం సంరక్షణ కేంద్రానికి తరలించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఏజెంట్లను రైల్వే పోలీసులు విచారిస్తున్నారు. బుధవారం మురళీధర్‌ మాట్లాడుతూ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో 25 మంది బాలురను సంరక్షించి, 15 మంది ఏజెంట్లను అరెస్ట్‌ చేశామన్నారు. తనిఖీల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందిని రైల్వే డీఐజీ సత్య ఏసుబాబు అభినందించారు.

‘సర్‌’లో చురుగ్గా పాల్గొనాలి : కలెక్టర్‌

నెల్లూరు రూరల్‌: కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు చేపడుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో రాజకీయ పార్టీల ప్రతినిధులు భాగస్వాములు కావాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా కోరారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమ పురోగతిపై కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులకు ఓటు హక్కు కల్పించడం, అనర్హుల పేర్ల తొలగింపు, పారదర్శకమైన జాబితా రూపొందించడమే కార్యక్రమ లక్ష్యమని తెలిపారు. డీఆర్వో విజయ్‌కుమార్‌, పార్టీల ప్రతినిధులు రసూల్‌, శ్రీనివాసులు, బాలసుధాకర్‌, శ్రీరామ్‌, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

లైటింగ్‌ పనులు చేస్తుండగా..

నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి

కోవూరు: మండలంలోని ఇనమడుగు గ్రామానికి చెందిన మావిళ్ల నరేష్‌ (37) ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కిందపడి చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. నరేష్‌ బుధవారం కోవూరులోని ఓ నాలుగు అంతస్తుల భవనంలో లైటింగ్‌ పనులు నిర్వహిస్తున్న సమయంలో కాలుజారి కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబానికి ఆధారంగా ఉన్న నరేష్‌ మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.

అటవీ ప్రాంతంలో మృతదేహం

ఊటుకూరు వాసిగా గుర్తింపు హత్యగా అనుమానం

దుత్తలూరు: మండలంలోని బండకిందపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం కుళ్లిన స్థితిలో మృతదేహాన్ని గుర్తించారు. బస్తాలో ఉన్న మృతదేహాన్ని స్థానికులు చూసి అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ సిబ్బంది పోలీసులకు చెప్పారు. దీంతో ఉదయగిరి సీఐ వెంకట్రావు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గోనెసంచిలో వరిగడ్డి వేసి అందులో మృతదేహాన్ని ఉంచినట్లు గుర్తించారు. క్లూస్‌ టీమ్‌ వచ్చి పరిసర ప్రాంతాల్లో ఆధారాలు సేకరించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడిని వింజమూరు మండలం ఊటుకూరుకు చెందిన దేవరకొండ గోవిందులు (55)గా గుర్తించారు. అతను చనిపోయి లేదా హత్య చేయబడి నాలుగు నుంచి ఐదురోజులై ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు. నివేదిక అందగానే మృతికి గల కారణాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

బ్యాంక్‌లో షార్ట్‌ సర్క్యూటై ఫైళ్లు దగ్ధం

కావలిరూరల్‌: పట్టణంలోని జేబీ కాలేజీ వద్ద ఉన్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో బుధవారం షార్ట్‌ సర్క్యూటై ఫైళ్లు కాలిపోయాయి. సిబ్బంది కార్యాలయానికి ఉదయం 10 గంటలకు వచ్చారు. అప్పటికి విద్యుత్‌ సరఫరా లేదు. 10:40 గంటలకు కరెంట్‌ వచ్చింది. ఆ సమయంలో స్టోర్‌ రూమ్‌లో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి పాత ఫైళ్లు కొన్ని దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే వచ్చి బ్యాంక్‌లో మంటలను ఆర్పి వేశారు. ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని స్టోర్‌ రూమ్‌లో అవసరం లేని పాత గోల్డ్‌ లోన్లు ఫైల్స్‌ మాత్రమే దగ్ధం అయ్యాయని మేనేజర్‌ సింగంశెట్టి ప్రియాంక తెలిపారు. ఏ విధమైన ఆస్తి నష్టం జరగలేదని, ఖాతాదారులు భయపడాల్సిన అవసరం లేదన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement