సవాలక్ష షరతులు..రాయితీలకు కొర్రీలు | - | Sakshi
Sakshi News home page

సవాలక్ష షరతులు..రాయితీలకు కొర్రీలు

Jun 25 2026 12:30 AM | Updated on Jun 25 2026 12:30 AM

సవాలక్ష షరతులు.. రాయితీలకు కొర్రీలు

నెల్లూరు(వేదాయపాళెం): జిల్లాలోని ఉద్యాన రైతులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపుతోంది. ఉద్యాన తోటల పెంపకానికి విరివిగా ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఉద్యాన సాగులో అత్యంత కీలకమైన పెంట్‌హౌస్‌లు, పందిళ్లు, షేడ్‌నెట్లు, డ్రై ప్లాట్‌ఫామ్స్‌, స్ప్రింక్లర్లు, స్ప్రేయర్లు వంటి మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ ప్రోత్సాహం కరువైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వం అరకొరగా నిధులను మంజూరు చేయగా వాటిని కూడా పూర్తి స్థాయిలో ఖర్చు చేయలేదు. సవాలక్ష ఆంక్షలతో కొర్రీలు పెట్టడంతో ప్రోత్సహకాలను రైతులు వినియోగించకోక నిధులు తిరిగి వెనక్కి వెళ్లినట్లు సమాచారం.

కాగితాల్లోనే కేటాయింపులు

2025–26 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఉద్యానశాఖకు సుమారు రూ.12 కోట్ల మేర నిధులు మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 4,812 మంది లబ్ధిదారులకు రూ.8.48 కోట్లు మాత్రమే విడుదల చేశారు. మిగిలిన మొత్తం ఆర్థిక సంవత్సరం ముగియడంతో తిరిగి ఖజానాకు చేరిపోయాయి. 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.11.07 కోట్లు కేటాయించారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం మొదలై మూడు నెలలు గడచిపోతున్నా ఒక్క రైతుకు నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని ఉద్యాన రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా మామిడి, నిమ్మ, బొప్పాయి, డ్రాగన్‌ఫ్రూట్‌, పూల తోటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ సాగుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు, ప్రోత్సాహం, యంత్ర సామగ్రి, శిక్షణ ప్రభుత్వం అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉద్యాన రైతులకు ఏ విధమైన ఆదరణ, భరోసా, సరైన మార్కెటింగ్‌ లేక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

సాగుకు దూరమై..

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ రైతుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పంటలు వేసుకుని పందిళ్లు నిర్మించుకుని చెట్లు బతికిన తర్వాత దశల వారీగా బిల్లులు అందజేస్తే అప్పుడు 50 శాతం సబ్సిడీ నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో కుదేలవుతున్నారు. సాగుకు పెట్టుబడులు లేక పొలాలను సాగు చేయకుండా వదిలేయాల్సిన పరిస్థితులు ప్రస్తుత ప్రభుత్వంలో నెలకొన్నాయని ఎస్సీ, ఎస్టీ రైతులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా వేలాది మంది అర్హత గల ఉద్యాన రైతులు ఉన్నారు. అయినా గతేడాది కేవలం 4,812 మందికి 50 శాతం సబ్సిడీ రుణాలు అందజేసి ప్రభుత్వం చేతులు దులుపుకొందని రైతులు బాహాటంగా విమర్శిస్తున్నారు.

ఉద్యాన రైతులకు కూటమి మొండిచేయి

గతేడాది జిల్లాకు రూ.12 కోట్లు మంజూరు

అందులో రూ.3.52 కోట్లు వెనక్కి

ఈ ఏడాది మూడు నెలలు

గడిచినా అందని సాయం

మొక్కలు బతికితేనే

50 శాతం సబ్సిడీ నిబంధన

సాగుకు దూరమవుతున్న

ఎస్సీ, ఎస్టీ రైతులు

ప్రోత్సాహం అందించాం

2025–26 ఆర్థిక సంవత్సతంలో 4,812 మంది లబ్ధిదారులకు ప్రోత్సాహం అందించాం. రూ.8.48 కోట్లు అచీవ్‌వెంట్‌ సాధించాం. ఈ ఏడాది రూ.11.07 కోట్ల నిధులు మంజూరయ్యాయి.

– ఎంవీ సుబ్బారెడ్డి,

జిల్లా ఉద్యాన అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement