దొంగల హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

దొంగల హల్‌చల్‌

Jun 25 2026 12:30 AM | Updated on Jun 25 2026 12:30 AM

జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు

దగదర్తిలో నగదు, బంగారం,

వెండి అపహరణ

జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో దొంగలు హల్‌చల్‌ చేశారు. ఆలయాలు, ఇళ్లు, మద్యం షాపుల్లో చోరీలకు పాల్పడ్డారు.

దగదర్తి: మండల కేంద్రమైన దగదర్తి మల్లయ్యమిట్ట ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన చోరీ కలకలం రేపింది. సుమారు రూ.4 లక్షల నగదు, ఏడు సవర్ల బంగారు నగలు, 750 గ్రాముల వెండి వస్తువులను చోరీ చేశారు. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. షేక్‌ అలీమ్‌ ప్రధాన రహదారి పక్కన నివాసం ఉంటూ టిఫిన్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం అతని భార్య, కుమారుడు సమీపంలోని వెలుపొడు గ్రామానికి వెళ్లారు. అలీమ్‌ రాత్రి ఇంటి వద్ద నిద్రించే సమయంలో తలుపులకు తాళం వేయలేదు. బీరువా తాళాన్ని అక్కడే ఉంచి ఆరుబయట నిద్రపోయాడు. బుధవారం ఉదయం భార్య, కుమారుడు ఇంటికి చేరుకుని బీరువాను పరిశీలించగా అందులో ఉన్న నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవడంతో చోరీ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలు సేకరించింది. డాగ్‌ స్క్వాడ్‌ను పిలిపించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహేంద్ర తెలిపారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రెండు వైన్‌ షాపుల్లో..

దుత్తలూరు: మండల కేంద్రమైన దుత్తలూరులో రెండు వేర్వేరు చోట్ల ఉన్న వైన్‌ షాపుల్లో మంగళవారం రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఒక దుకాణంలో రూ.లక్ష నగదు, మరో దుకాణంలో కొద్దిపాటి నగదు, మద్యాన్ని అపహరించారు. బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రెండు ఆలయాల్లో..

వరికుంటపాడు: మండలంలోని తూర్పుచెన్నంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోరీలు జరిగాయి. స్థానికులు కథనం మేరకు.. రామాలయం, అంకాలమ్మ ఆలయాల్లో హుండీలను గుర్తుతెలియని దుండగులు పగులగొట్టారు. సుమారు రూ.10 వేల వరకు నగదును చోరీ చేశారు. గ్రామస్తుల సమాచారంతో ఎస్సై మధుసూదన్‌రావు, పోలీస్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. చోరీకి పాల్పడిన దొంగలను త్వరితగతిన గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు కోరారు. మండలంలో ఉండే 24 పంచాయతీల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. రూ.లక్షల విలువచేసే నగలు వెండి వస్తువులు చోరీకి గురవుతున్నాయి. అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement