● బారాషహీద్ దర్గాలో
తలనీలాల పేరుతో దోపిడీ
● కమిటీ సభ్యుడికే బాధ్యతలు
నెల్లూరు(బారకాసు): దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న సామెతను నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఓ కమిటీ సభ్యుడు సీరియస్‌గా తీసుకున్నాడు. ఒక్కొక్కరికి గుండు చేసేందుకు రూ.400 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా జరిగే రొట్టెల పండగకు దేశ, విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. తమ కోర్కెలు తీరితే తలనీలాలు సమర్పిస్తామని అనేకమంది మొక్కుకుంటారు. దర్గా ప్రాంగణం మొత్తంగా ఒకేచోట తలనీలాలు సమర్పించేందుకు ప్రత్యేకంగా స్టాల్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ చెప్పిన మొత్తాన్ని భక్తులు ఇస్తేనే గుండు చేస్తారు.
తమ వారికే..
రొట్టెల పండగ కోసమని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు తమ జేబులు నింపుకొనేందుకు ఒక్కొక్కరికి ఒక్కో అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా తలనీలాలు సమర్పించే ప్రత్యేక స్టాల్‌ను కమిటీలోని ఓ సభ్యుడికి అప్పగించారన్న ఆరోపణలున్నాయి. ఏడాదికి ఒకసారి జరిగే పండగ సమయంలో వచ్చిన అవకాశాన్ని వారు వదులుకోలేదు. ఈనెల 26వ తేదీ నుంచి రొట్టెల పండగ మొదలవుతుంది. అందుకు ముందు నుంచే ఈ దోపిడీకి తెరలేపినట్లు తెలుస్తోంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తలనీలాలు సమర్పించాలంటే ఒక్కొక్కరి నుంచి రూ.400 చొప్పున వసూలు చేస్తున్నారు. లోకల్‌గా ఉన్న వారి నుంచి రూ.300, కమిటీ సభ్యులకు తెలిసిన వారైతే వారి నుంచి నామమాత్రం రుసుం ఇలా రకరకాలుగా తీసుకుంటున్నారు. ఐదు రోజులపాటు జరిగే పండగకు లక్షలాది మంది భక్తులు రానున్నారు. ఈ దోపిడీని అరికట్టాలని, నామమాత్రపు రుసుం వసూలు చేయాలని భక్తులు కోరుతున్నారు.


