సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌సీపీ నేతలు రోడ్డెక్కితే.. కూటమి ప్రభుత్వానికి కూసాలు కదులుతున్నాయి. చంద్రబాబు, లోకేశ్ రెడ్‌బుక్‌ను అడ్డు పెట్టుకుని.. పోలీసులపై ఒత్తిళ్లు పెంచి ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసుల పరంపర కొనసాగిస్తున్నారు. తండ్రీకొడుకుల అసమర్థ పాలనను ప్రశ్నించినా.. ఎన్నికల హామీలు, మోసాలు, వెన్నుపోట్లపై నిలదీసినా.. అవినీతి, అక్రమాలు, కుంభకోణాలపై నిగ్గదీసినా కేసులే. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలను టార్గెట్ చేసి బనాయించిన అక్రమ కేసులకు లెక్కేలేదు. ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేసినా నేరంగా మారింది.
రెడ్‌బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీ
అధికార పార్టీ తన ప్రతీకార రెడ్‌బుక్ రాజకీయాలకు ఖాకీలను కవచంగా ఉపయోగించుకుంటోంది. ప్రశ్నించే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసి కేసులను ఆయుధంగా చేసుకుని అణచివేయడం అప్రజాస్వామ పాలనకు అద్దం పడుతోంది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన భారత రాజ్యాంగం జిల్లాలో అపహాస్యం పాలవుతోంది. లోకేశ్ రెడ్‌బుక్ రాజ్యంలో రాజ్యాంగం బందీగా మారింది. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసనలు చేయడం కూడా నేరమన్నట్లుగా వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు.
డీఎస్సీలో అక్రమాలను ప్రశ్నించడమే నేరం
మెగా డీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాలను ప్రశ్నించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి కుటుంబ సభ్యుల విద్యాసంస్థలపై దాడులకు చినబాబు రెడ్‌బుక్ ఉసిగొల్పింది. ఎమ్మెల్సీకి జరిగిన అన్యాయాన్ని వెలుగెత్తి చాటేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పార్టీ సమన్వయకర్తలపై మరోసారి రెడ్‌బుక్ రాజ్యాంగం అక్రమ కేసులు బనాయించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి సంఘీభావంగా నెల్లూరు వీఆర్‌సీ సెంటర్‌లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన ప్రదర్శించడం కూడా పెద్ద నేరమన్నట్లుగా ఒకే రోజు ఒకే ఘటనపై రెండు అక్రమ కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చగా మిగిలింది. అందులో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిని రెండు కేసుల్లో ఏ1గా ఉంచడం వెనుక రెడ్‌బుక్ కట్ర కోణం దాగి ఉంది. వైఎస్సార్‌సీపీ ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డిలను ఆ కేసుల్లో ఇరికించడం కూడా రెడ్‌బుక్ కుట్రకోణంలో భాగమేనని సృష్టమవుతోంది.
ప్రశ్నించే గొంతుకలకు సంకెళ్లు
శాంతియుత నిరసనలు చేసినా నేరమే
ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ కేసులు నమోదు
జిల్లాలో ఎనిమిది మంది వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలపై అక్రమ కేసులు
జిల్లా అధ్యక్షుడు కాకాణిపై 26 అక్రమ కేసులు.. తాజాగా మరొకటి
ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిపై
ఒకే రోజు రెండు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల వ్యవధిలో జిల్లాలో వైఎస్సార్‌సీసీ సమన్వయకర్తలను టార్గెట్ చేశారు. తమ నియోజకవర్గాల్లో జరిగిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించడమే నేరమైనట్లు, పార్టీ పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించడం అసాంఘిక కార్యక్రమైనట్లు అక్రమ కేసులు బనాయించడం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై 26 అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారు. మాజీ ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాజీ మంత్రులు అనిల్‌కుమార్‌యాదవ్, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితోపాటు నెల్లూరు రూరల్, ఉదయగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డిలపై అక్రమ కేసులు నమోదు చేశారు.


