సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇసుక, గ్రావెల్ మాఫియాలు చెలరేగిపోతున్నాయి. ఈ కోవలోనే జిల్లాలోని అనంతసాగరం మండలం పడమటి కంభంపాడులో గల పెన్నానదిలో ఇసుక రీచ్‌ను రాష్ట్రంలోనే తొలిసారిగా అనధికారంగా ప్రారంభించారు.
నిత్యం భారీగా..
పడమటి కంభంపాడు అనధికార రీచ్‌లో పరిమితికి మించి నిత్యం వందల చొప్పున లారీలు, టిప్పర్లలో ఇసుకను లోడ్ చేయిస్తూ కొందరు టీడీపీ నేతలు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. లారీ కెపాసిటీని బట్టి పది చక్రాల వాహనానికి రూ.పది వేలు, 12 చక్రాల వాహనానికి సుమారు రూ.15 వేలను వసూలు చేస్తున్నారు. ఇక్కడి ఇసుకకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో మంచి డిమాండ్ ఉండటంతో భారీగా విక్రయించి వెనుకేసుకుంటున్నారు.
దుర్భరంగా రోడ్లు
మండల పరిధిలోని ఉప్పలపాడు చెరువుకట్ట నుంచి సోమశిల వరకు ప్రధాన రహదారి పూర్తిగా మట్టి రోడ్డుగా మారిపోయింది. ఇసుక లారీలు వందల సంఖ్యలో పరిమితికి మీరి అధిక టన్నేజీతో తిరుగుతుండటంతో ఈ దారంతా గుంతలమయంగా దర్శనమిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు సోమశిల వెళ్లే వీల్లేక ఆర్టిసీ బస్సులు నిలిచిపోయాయి. రహదారిని దుర్భరంగా మార్చిన వారిపై స్థానికులు మండిపడుతున్నారు. ఇలానే వదిలేస్తే రీచ్ వద్ద ధర్నాకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
పట్టించుకునేవారేరీ..?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపే కొందరు పచ్చ నేతలకు రీచ్‌ను అనధికారికంగా అప్పగించి లోడింగ్‌ను అక్రమంగా ప్రారంభించారు. ఈ విషయం మీడియాలో బయటపడటంతో పార్టీ అధిష్టానం సైతం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. అయితే వారు అధికారంలో ఉండటంతో ఏమీ చేయలేక నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇలానే మరికొద్ది రోజులు సమీపంలో తవ్వుకుంటూ వెళ్తే జలాశయానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సమీప గ్రామాల వారు పేర్కొంటున్నారు.
భారీ యంత్రాలతో..
పెన్నాలో ప్రస్తుతం హిటాచీ మెషీన్లను ఏర్పాటు చేసి భారీ లారీలు, టిప్పర్లకు లోడ్ చేస్తున్నా, కనీస చర్యలు కరువవుతున్నాయి. ముడుపులు అందుతుండటంతోనే జిల్లా మైనింగ్ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా వీటిని నిరోధించాలని కోరుతున్నారు. కాగా ఈ విషయమై తహసీల్దార్ వీరవసంతరావును సంప్రదించగా, ఆయన చెప్పిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక అక్రమ దందా రోజూ సాగుతుండగా, తమకు సమాచారం లేదని ఆయన బదులిచ్చారు.
లక్షల టన్నుల అక్రమ రవాణా
పేట్రేగిపోతున్న మాఫియా
మట్టి రోడ్లుగా మారిన ప్రధాన రహదారులు
రీచ్‌వైపు కన్నెత్తి చూడని అధికారులు
పీకేపాడులో ఇదీ తీరు


