దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు వినతి | - | Sakshi
Sakshi News home page

దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలకు వినతి

Jun 25 2026 12:30 AM | Updated on Jun 25 2026 12:30 AM

రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి

ఎస్పీకి వినతిపత్రం అందజేత

నెల్లూరు(క్రైమ్‌): సోషల్‌ మీడియా వేదికగా తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కావలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ అజితకు వినతిపత్రాన్ని బుధవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. సోషల్‌ మీడియా వేదికగా కొంతకాలంగా మధు, మనోహర్‌, హరీష్‌, శ్రీను, కిశోర్‌ తనపై అసత్య ప్రచారాలు చేస్తూ, అవమానకర పోస్టులు పెడుతూ తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సదరు వ్యక్తులపై కావలి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్లో ఈ నెల 14న ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు చేపట్టాల ని కోరగా, ఎస్పీ సానుకూలంగా స్పందించారని వివరించారు.

అక్రమ కేసులు బనాయిస్తున్నారు

కావలి నియోజకవర్గంలో అధికార పార్టీ సాగిస్తున్న అన్యాయాలు, అక్రమాలను ప్రశ్నించేవారిపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. చెన్నాయపాళెం చెరువులో పగలూ, రాత్రనే తేడా లేకుండా వందలాది టిప్పర్ల్ల ద్వారా గ్రావెల్‌ను అక్రమార్కులు 20 రోజులుగా తరలిస్తున్నారని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్‌ను గ్రామ రైతులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారని పేర్కొన్నారు. ఆర్డీఓతో మాట్లాడి తగు చర్యలు చేపడతామని కలెక్టర్‌ హామీ ఇచ్చినా, పరిస్థితిలో నేటికీ ఎలాంటి మార్పులేదని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో విషయాన్ని తన దృష్టికి తీసుకురాగా, ఆర్డీఓను కలిసి పరిస్థితిని వివరించామన్నారు. కావలి, మన్నంగిదిన్నె, బుడంగుంట చెరువులు, చింతలపాళెం తిప్ప ప్రాంతాల్లో జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ రవాణాను అరికట్టాలని కోరామని తెలిపారు. మైనింగ్‌, విజిలెన్స్‌, ఇరిగేషన్‌ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, స్థానిక ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రమేయం కారణంగా తామేమీ చేయలేమని కొందరు ఇరిగేషన్‌ అఽధికారులు చెప్పారని ఆరోపించారు. ఈ క్రమంలోనే టిప్పర్లను గ్రామస్తులు అడ్డుకోగా జరిగిన ఘర్షణలో గ్రావెల్‌ మాఫియాపై చర్యలు చేపట్టకుండా గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు, మరో ముగ్గురిపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులను నమోదు చేశారని చెప్పారు. అక్రమాలు, అన్యాయాలను కట్టడి చేయడంలో అధికారులు విఫలమయ్యారని విమర్శించారు. కావలిలో అక్రమ కేసులు పరిపాటిగా మారాయని ధ్వజమెత్తారు. అక్రమ మైనింగ్‌ను గతంలో తాము ఖండించామని, ఈ వ్యవహారంలో కొందరు వీడియో తీయగా సంబంధం లేని తనపై తప్పుడు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. కొందరు మీడియా ప్రతినిధులు, నేతలపైనా కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. దగదర్తి మండలం బోడిగుడిపాడులో పంచాయతీ స్థల వివాదంలో కొందరిపై పోలీసుల సమక్షంలో టీడీపీ నేతలు దాడులు చేశారని, బాధితులు ఫిర్యాదు చేసినా ఇంత వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఈ అంశాలన్నింటినీ ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు చేపట్టాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. పార్టీ కావలి పట్టణాధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, దగదర్తి మండల కన్వీనర్‌ వెలినేని మహేష్‌నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు కనమర్లపూడి వెంకటనారాయణ, అల్లూరు పంచాయతీ కన్వీనర్‌ దండే కృష్ణారెడ్డి, ఎస్సీ జిల్లా సెల్‌ అధ్యక్షుడు పందిటి కామరాజు, కందుర్తి కామయ్య, గుడ్లూరు మాల్యాద్రి, చిన్న పుల్లయ్య, చిన్న ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

గిరిజన మహిళపై అమానుషం

కావలిలోని 23వ వార్డులో గిరిజన మహిళను టీడీపీ నేతలు వివస్త్ర చేసి దౌర్జన్యానికి పాల్పడ్డారనే విశ్వసనీయ సమాచారం తనకు ఉందని ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఈ విషయం ఇంకా బయటకు పొక్కలేదని, జరిగిన దారుణం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆయన చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement