నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో రాబందుల రాజ్యం నడుస్తోంది. మార్చురీ విభాగంలో శవాలకు పోస్టుమార్టం చేసేందుకు సైతం బేరసారాలు సాగిస్తున్నారు. జీజీహెచ్‌లోని మార్చురీకి పోస్టుమార్టం కోసం వచ్చే మృతదేహాల్లో ప్రమాదాలకు గురైన, ఆత్మహత్యలు చేసుకున్నవే ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో కుటుంబ సభ్యుల బాధను ఎవరూ తీర్చలేరు. అయితే మానవత్వంతో వ్యవహరించాల్సిన మార్చురీ సిబ్బంది పోస్టుమార్టం చేసేందుకు వేలాది రూపాయలను బాధిత బంధువుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న వారి నుంచి లంచాలు వసూలు చేయడంపై ‘సాక్షి’లో జనవరి 23న ‘జీజీహెచ్‌లో రాబందులు’, మార్చిలో ‘మార్చురీలో రాబందులు’ అనే శీర్షికల తో కథనాలు వెలువడ్డాయి. పత్రికల్లో ఎన్ని కథనాలొచ్చినా మాకెందుకు భయం..సిగ్గు అన్న చందంగా మారింది మార్చురీ సిబ్బంది తీరు. తాజాగా దారా మల్లికార్జున అనే బాధితుడు తన నుంచి లంచాలు ఎలా వసూలు చేశారో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండేటి మాధవికి మంగళవారం రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియాకు వీడియోను సైతం విడుదల చేయడంతో మార్చురీలో లంచాల బాగోతం మరోమారు వెలుగులోకి వచ్చింది.
పోస్టుమార్టానికి రూ.5,500 వసూలు
కోవూరు మండలం జమ్మిపాళెం గ్రామానికి చెందిన మల్లికార్జున పెదనాన్న నాగభూషణం బైకు యాక్సిడెంట్‌కు గురయ్యాడు. సర్వజన ఆస్పత్రికి తీసుకుని రాగా అక్కడ మృతి చెందాడు. అయితే పోస్టుమార్టం చేసేందుకు మార్చురీలో అటెండెంట్‌గా పనిచేసే ఒక ఉద్యోగి పెద్ద మొత్తంలో లంచం అడిగాడు. బేరసారాలు కుదిరాక రూ.2,500 నగదు రూపంలో ఇచ్చాడు. మిగిలిన నగదు చేతిలో లేకపోవడంతో సుధీర్ అనే అటెండెంట్ సూచించిన మేరకు గౌతమ్ అనే వ్యక్తికి రూ.3వేలు నగదును ఫోన్‌పే చేశాడు. ఈ విషయమై మల్లికార్జున ఆస్పతి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. తన లాగా మరొకరిని పీడించకూడదనే ఉద్దేశంతోనే ఫిర్యాదు చేస్తున్నానని బాధితుడు తెలిపారు.
వేటుపడినా మారని తీరు
గతంలో మార్చురీలో పని చేసే కొంతమంది డాక్టర్లు తమ కింది స్థాయి సిబ్బంది ద్వారా లంచాలు వసూలు చేసేవారు. అటెండెంట్ బాధితులను పీడించి వసూలు చేసిన సొమ్మును డాక్టర్లతో కలిసి పంచుకునేవారు. ఈ విషయమై ‘సాక్షి’లో కథనాలు రావడం, లంచాల గురించి ఇష్టం లేని ఒక డాక్టర్ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి సద రు వ్యక్తిని కలెక్టర్ సూచనతో ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే ఆ అటెండెంట్ కోర్టు కెళ్లి మళ్లీ తన ఉద్యోగం తెచ్చుకున్నాడు. అయితే సూపరింటెండెంట్ ఆరోపణలు వచ్చిన పాత స్థానంలోనే మళ్లీ పోస్టింగ్ ఇవ్వడంపై విమర్శలు జోరందుకున్నాయి.
పని చేయని రెండు సీసీ కెమెరాలు
మార్చురీలో లంచాల గోలపై స్పందించిన సూపరింటెండెంట్ ఇటీవల అక్కడ పదమూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. రెండు నెలలు గడవక ముందే కీలకమైన ప్రదేశంలో ఉండే రెండు కెమెరాలు పని చేయడం లేదు. లంచాల బాగోతం బయట పడుతుందనే వైర్లు కట్ చేసి పనిచేయకుండా చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆస్పత్రి చైర్మన్ లేదా కలెక్టర్ స్పందించి మార్చురీలోని రాబందులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
పోస్టుమార్టంలో శవ బేరసారాలు
మార్చురీ సిబ్బంది తీరుపై
పలుమార్లు మీడియాలో కథనాలు
అయినా తీరు మార్చుకోని వైనం
బాధితుడి ఫిర్యాదుతో మరోమారు లంచాల వ్యవహారం వెలుగులోకి
చోద్యం చూస్తున్న అధికారులు


