సాక్షి టాస్క్‌ఫోర్స్: సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ దోపిడీదారులు చెలరేగిపోతున్నారు. సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్‌ను కొల్లగొడుతున్నారు. పగలు , రాత్రి అనే తేడా లేకుండా అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రవాణా, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు మామూళ్ల మత్తులో అటువైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే కంటేపల్లి వద్ద రైల్వే అభివృద్ధి పనుల్లో భాగంగా అండర్ బ్రిడ్జి వద్ద అడ్డుగా ఉన్న గ్రావెల్‌ను తరలిస్తున్న టిప్పర్లను పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు
వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, శ్రీకాంత్‌కాలనీ, నాగంబొట్లకండ్రిగ తదితర గ్రామాల్లో పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమ గ్రావెల్ రవాణా జరుగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే అక్రమంగా తవ్వకాలు చేస్తున్నా వారి జోలికి రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు వెళ్లడం లేదు. గ్రావెల్ మాఫియా నుంచి నెలనెలా మామూళ్లు అందడంతోనే పోలీసులు గ్రావెల్ అక్రమ రవాణా చేస్తున్న టిప్పర్లను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అయితే నాలుగు రోజుల క్రితం కంటేపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనుల వద్ద ఉన్న గ్రావెల్‌ను తరలిస్తుంటే పోలీసులు అక్కడికి చేరుకుని మూడు టిప్పర్లను అడ్డుకుని వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ గుట్టలు నిర్మాణ పనులకు అడ్డుగా ఉండడంతో టిప్పర్ల ద్వారా బయటకు తరలిస్తుంటే పోలీసులు అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించిన మూడు టిప్పర్లలో రెండింటిని వదిలేశారు. ఒక్క టిప్పర్‌ను మాత్రమే పోలీస్‌స్టేషన్‌లో ఉంచడంతో సదరు టిప్పర్ నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తున్న టిప్పర్ల జోలికి వెళ్లకుండా, రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణం కోసం తవ్విన గ్రావెల్ పనులకు అడ్డుగా ఉండడంతో బయటకు తరలిస్తుండగా పోలీసులు అడ్డుకోవడం వెనుక అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యనేత అండతో..
సర్వేపల్లి నియోజకవర్గంలోని వెంకటాచలం, పొదలకూరు, ముత్తుకూరు మండలాల్లో సర్వేపల్లి ముఖ్యనేత అండతో గ్రావెల్ దోపిడీ నిర్విరామంగా సాగుతోంది. మైనింగ్ అనుమతులు లేకుండానే కోట్లాది రూపాయల విలువ చేసే గ్రావెల్ సంపదను కొల్లగొట్టారు. ప్రస్తుతం వెంకటాచలం మండలంలోని రామదాసుకండ్రిగ, నాగంబొట్లకండ్రిగ, శ్రీకాంత్‌కాలనీలో పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గ్రావెల్ రవాణాతో తమ గ్రామాలు దుమ్ముకొట్టుకుపోతున్నాయని, తాము బతికేదెలాగా అని గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేసినా లెక్క చేయకుండా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. గ్రావెల్ టిప్పర్ల రద్దీతో తాము నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని నాగంబొట్లకండ్రిగ గ్రామస్తులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని బెదిరింపులకు గురిచేసి మరీ గ్రావెల్ రవాణా సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
సర్వేపల్లిలో చెలరేగిపోతున్న గ్రావెల్ మాఫియా
ముఖ్యనేత అండతో
రేయింబవళ్లు తరలింపు
కన్నెత్తి చూడని రెవెన్యూ,పోలీసు అధికారులు
రైల్వే అండర్ బ్రిడ్జి పనులకు అడ్డుగా మట్టికుప్పలు
తరలిస్తుండగా టిప్పర్లను పట్టుకున్న పోలీసులు
వారి తీరుపై తీవ్ర విమర్శలు


