● ఎంపీడీఓ ఆఫీసు ఎదుట నల్లగొండ్ల,
శంఖవరం గ్రామస్తుల ఆందోళన
● విచారణ జరిపి బాధ్యులపై
చర్యలు తీసుకోవాలని డిమాండ్
వింజమూరు(ఉదయగిరి):మండలంలోని నల్లగొండ్ల, శంఖవరం గ్రామాల్లో గత ప్రభుత్వంలో నాడు–నేడు కింద నిర్మించిన పాఠశాలల ప్రహరీలను చూపి కొత్తగా ఎంబుక్‌లు నమోదు చేసి ఉపాధి నిధులు రూ.22.51 లక్షలు స్వాహా చేశారని గ్రామస్తులు ఆరోపించారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. నిధుల స్వాహాపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద నల్లగొండ్ల పాఠశాలకు ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లుగా తెలిపారు. అందుకు సంబంధించి బిల్లులు కూడా మంజూరయ్యాయని చెప్పారు. ప్రస్తుతం ఆ ప్రహరీని చూపి ఉపాధి నిధులు రూ.9.71 లక్షలు స్వాహా చేశారని ఆరోపించారు. అలాగే శంఖవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రహరీని చూపి మరో రూ.12.80 లక్షలను స్వాహా చేసినట్లుగా తెలిపారు. ఇందులో ఎంఈఓ కార్యాలయంలో పనిచేసే ఓ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి పాత్ర ఉందని, ఆయన తన భార్య ఖాతాలో రెండు గ్రామాలకు సంబంధించి రూ.22.51 లక్షల నగదును వేయించుకున్నారని ఆరోపించారు. ఈ విషయమై సర్వశిక్ష అభియాన్ ఏఈ కృష్ణారెడ్డిని తాము ప్రశ్నించగా తనకు తెలియదని చెప్పారన్నారు. ఎంపీడీఓతో మాట్లాడగా 2020–21 సంవత్సరానికి సంబంధించిన పనులకు బిల్లులు చెల్లించాలని సర్వశిక్ష అభియాన్ అధికారులు తమను కోరగా వాటికి ఆమోదం తెలిపానని, మిగిలిన విషయాలు ఆ శాఖ అధికారులకే తెలియాలని చెప్పారన్నారు. నిధులు దుర్వినియోగంపై కలెక్టర్ విచారణ జరిపించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.


