● ఎస్పీ అజిత
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బారాషహీద్ దర్గాలో ఈనెల 26 నుంచి జరిగే రొట్టెల పండగకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశించారు. నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో రొట్టెల పండగ బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో ఎస్పీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దర్గా ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలను అనుసంధానం చేయాలన్నారు. ప్రత్యేక పార్కింగ్ జోన్లు ఏర్పాటు చేసి నిర్దేశిత ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. డాగ్‌స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో నిరంతర తనిఖీలు చేయలన్నారు. పోలీస్ సేవాదళ్ సభ్యులు వృద్ధులు, ప్రత్యేక అవసరాలున్న భక్తులు దర్గా సందర్శన, రొట్టెల మార్పిడికి సహాయం చేయాలన్నారు. స్వర్ణాల ఘాట్, బోటింగ్ పాయింట్ల వద్ద లైఫ్ సేవింగ్ ఎక్విప్‌మెంట్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గంధం ఉరేగింపు, క్యూలైన్ల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఏఎస్పీ సీహెచ్ సౌజ న్య, నగర ఏఎస్పీ దీక్ష, దర్గామిట్ట ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ జీ వేణుగోపాల్‌రెడ్డి, సౌత్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ వెంకటరెడ్డి సెక్టార్ల వారీగా బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ జోన్లు తదితరాలను వివరించారు. కసుమూరు దర్గా, మైపాడు, కోడూరు బీచ్‌ల వద్ద బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు రూరల్ డీఎస్పీ జీ శ్రీనివాసరావు తెలిపారు. ఏఆర్ ఏఎస్పీ అప్పారావు, ఆత్మకూరు, ఏఆర్, హోమ్‌గార్డ్స్ డీఎస్పీలు వేణుగోపాల్, చంద్రమోహన్, రామకృష్ణ, నెల్లూరు నగర, రూరల్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


