దగదర్తి: మండలంలోని తురిమెర్లలో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన సీసీ టీవీ ఫుటేజీలో నమోదైంది. సోషల్ మీడియాలో వైరలైంది. బాధితురాలు, కుటుంబ సభ్యులు సోమవారం వివరాలు వెల్లడించారు. గ్రామానికి చెందిన కొల్లి కామేశ్వరమ్మ ఆదివారం మధ్యాహ్నం తన గేదెలను మేతకు తీసుకెళ్తోంది. ఈ సమయంలో ఘటాల కొండయ్య ఇంటి ప్రహరీని గేదెలు రాసుకుంటూ వెళ్లాయి. దీంతో కొండయ్య అత్త, కామేశ్వరమ్మ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అక్కడే ఉన్న కొండయ్య ఆగ్రహానికి లోనై కామేశ్వరమ్మపై దాడి చేశాడు. ఆమెకు గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు కావలి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సోమవారం బాధితురాలి బంధువులు దగదర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళపై జరిగిన దాడిని గ్రామస్తులు ఖండించారు. నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు దగదర్తి ఎస్సై మహేంద్ర తెలిపారు.


